
ఇటీవల ఢిల్లీలో జపనీస్ ఎన్సెఫాలిటిస్ జ్వరం కేసు నమోదైంది. జపనీస్ ఎన్సెఫాలిటిస్ వైరస్ వల్ల ఇది వచ్చినట్లు తెలిసింది. ఈ వైరస్ సోకిన జంతువులు, పక్షుల నుంచి దోమలకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. అయితే మెదడువాపు వైరస్ కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా? అనే సందేహం ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది. కోవిడ్, మంకీపాక్స్ లాగా ఇది కూడా ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాపిస్తుందా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
జపనీస్ ఎన్సెఫాలిటిస్ లేదా జెఇ వైరస్ వ్యాప్తి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను పోలి ఉంటుందని ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జుగల్ కిషోర్ చెప్పారు. అంటే దోమ మనిషిని కుట్టినప్పుడు ఈ వైరస్ వ్యాపిస్తుంది. కానీ దోమ కాటు వల్ల డెంగ్యూ లేదా మలేరియా మాదిరి ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపించదు. అయితే జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాధి సోకిన వ్యక్తి మరొకరికి రక్తాన్ని ఇస్తే మాత్రం వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు చాలా తక్కువ.
ఎవరికైనా ఈ జ్వరం సోకినప్పుడు.. తేలికపాటి నుంచి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఈ వైరస్ కేసులు పిల్లలలో మాత్రమే సంభవిస్తాయి. మెదడువాపు వ్యాధి వస్తే.. మొదట్లో తేలికపాటి జ్వరం ఉంటుంది. తలనొప్పితో వాంతులు వస్తాయి. ఇది తీవ్రమైతే జ్వరం మెదడుకు వెళుతుంది. దీంతో మెదడు కణాలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో రోగి పరిస్థితి మరింత దిగజారుతుంది. మరణానికి కూడా కారణం కావచ్చు. ఈ జ్వరం మెదడుకు చేరిన తర్వాతే మెదడువాపు వ్యాధి కారణంగా మరణాలు సంభవిస్తాయి.
మెదడువాపు వ్యాధికి ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే.. దానికి ఇంతవరకూ ఎలాంటి చికిత్స లేదు. లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స జరుగుతుంది. అయితే మెదడువాపు వ్యాధిని నివారించడానికి టీకా ఉంది. ఈ వ్యాక్సిన్‌ను బిడ్డ పుట్టిన వెంటనే వేయించవచ్చు.