ఉదయం లేచిన వెంటనే కొంతమంది బ్రేక్‌ఫాస్ట్ తింటే.. మరికొందరు దాన్ని స్కిప్ చేసి నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. ఇంకొందరైతే ఒక రోజు బ్రేక్‌ఫాస్ట్ తిని.. మరోరోజు స్కిప్ చేస్తారు. అయితే ఇలా చేయడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రెగ్యులర్ డైట్‌లో మార్పులు చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన పోషకాలు నిండిన అల్పాహారం తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండగలం అని డాక్టర్లు చెబుతున్నారు.
అతిగా తినడం, స్థూలకాయం: మీరు బరువు తగ్గాలని అనుకుంటున్నట్లయితే.. అల్పాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. నిద్రలేచిన తర్వాత ఆరోగ్యకరమైన, పోషకాలు నిండిన బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే అలవాటు రోజంతా మీ ఆకలి బాధలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది అతిగా తినే అలవాటును తగ్గిస్తుంది. తద్వారా ఊబకాయం, ఒబేసిటీ వంటి సమస్యలు దరికి రావు.
ఆరోగ్యకరమైన అల్పాహారం మీ రోజును ఉత్సాహంగా ప్రారంభించడమే కాదు, దీర్ఘకాలంలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ స్ట్రోక్‌లు రావడానికి కారణమవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.
ప్రతీ రోజూ అల్పాహారం తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుందన్నారు. మరోవైపు, అల్పాహారం మానేయడం వల్ల ఇన్సులిన్ స్థాయిల అసమతుల్యత కారణంగా టైప్ 2 డయాబెటిస్ వస్తుందని అన్నారు.
మీరు అల్పాహారాన్ని మానేయడం వల్ల తరచుగా ఆకలితో అలమటించడమే కాదు.. జంక్ ఫుడ్‌కు ఆకర్షితులవుతారు. ఖాళీ కడుపుతో ఉన్నట్లయితే.. మీకు అలసట వస్తుంది. కాబట్టి.. మీ బ్లడ్ షుగర్, ఇన్సులిన్, ఎనర్జీ లెవల్స్‌ను సమతుల్యంగా ఉంచుకోవడానికి ప్రతీ రోజూ టిఫిన్ చేయడమే సరైన మార్గం. అల్పాహారం తినడం వల్ల మీ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పునరుద్ధరించబడతాయి. రోజంతా మెదడు యాక్టివ్‌గా పని చేస్తుంది.
ప్రతిరోజూ పోషకాలతో కూడిన అల్పాహారం తీసుకోవడం వల్ల మీరు రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. మీ అల్పాహారంలో ప్రోటీన్లు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, తాజా పండ్లు, కూరగాయలు ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాదు, సరైన శరీర బరువును మైంటైన్ చేయడం, దీర్ఘకాలిక వ్యాధులను దరికి చేరనివ్వకుండా ఉండటం చాలా అవసరం. ఇందుకోసం ప్రతీ రోజూ ఉదయాన్నే తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ చేయడం ముఖ్యం.