AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Health: కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ తప్పులు అస్సలు చేయకండి..!

మూత్రపిండాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు చాలా పని చేస్తాయి. కానీ మన జీవన విధానంలో చేసే కొన్ని తప్పుల వల్ల మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. కొందరు తెలియక చేసే అలవాట్లు మూత్రపిండాల పనితీరును దెబ్బతీసి తీవ్రమైన సమస్యలకు కారణమవుతాయి. అందుకే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సరైన జీవన విధానం అనుసరించడం చాలా అవసరం.

Kidney Health: కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ తప్పులు అస్సలు చేయకండి..!
Healthy Kidneys
Prashanthi V
|

Updated on: Mar 19, 2025 | 1:37 PM

Share

శరీరంలోని మలినాలను తొలగించే మూత్రపిండాలు సమర్థంగా పనిచేయకపోతే శరీరం ఆరోగ్యాన్ని కోల్పోతుంది. మూత్రపిండాలు స్వచ్ఛంగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన జీవన విధానం పాటించడం తప్పనిసరి. మన రోజువారీ అలవాట్లే మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మనం కిడ్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం.

చాలా మంది అధిక ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్, కొవ్వులతో కూడిన ఆహారం తీసుకోవడం అలవాటుగా మార్చుకుంటారు. వీటి ప్రభావం శరీరంలోని కిడ్నీలపై తీవ్రంగా ఉంటుంది. అధిక ఉప్పు తీసుకోవడం మూత్రపిండాల పనితీరును దెబ్బతీసి వాటిపై ఒత్తిడిని పెంచుతుంది.

కిడ్నీ సమస్యలు అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. అధిక రక్తపోటు మూత్రపిండాలకు రక్తప్రసరణను తగ్గించగా.. మధుమేహం ఉన్నవారిలో అధిక చక్కెర స్థాయిలు మూత్రపిండాల పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఈ వ్యాధులను నియంత్రించడం చాలా అవసరం.

శరీరం అవసరమైన మాదిరిగా నీరు తాగకపోతే మూత్రపిండాలు మలినాలను వడపోసే విధానం సరిగ్గా జరగదు. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి రోజూ కనీసం 2-3 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.

ధూమపానం, మద్యం తాగడం వల్ల రక్తనాళాలు ఇరుకుగా మారుతాయి. దీంతో మూత్రపిండాలకు రక్తం తక్కువగా చేరుతుంది. ఇలా అయితే మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఎక్కువ రోజులు ఈ అలవాట్లు కొనసాగితే మూత్రపిండాలు దెబ్బతిని పనిచేయడం తగ్గే అవకాశం పెరుగుతుంది.

కొన్ని నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల మూత్రపిండాల పనితీరుపై ప్రభావం పడుతుంది. ఇవి నేరుగా మూత్రపిండాలకు హాని కలిగించవచ్చు. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా ఏదైనా మందులు ఎక్కువగా వాడకూడదు.

కిడ్నీ ఆరోగ్యానికి నిద్ర ఎంతో ముఖ్యం. సరిగ్గా నిద్రపోకపోతే మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. నిద్ర లేమి కారణంగా రక్తపోటు పెరిగి, మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. కనీసం 7-8 గంటలు నిద్రపోవడం అనేది కిడ్నీల ఆరోగ్యానికి చాలా అవసరం.

కిడ్నీలు శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇవి బలహీనపడితే ఇతర అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే.. కిడ్నీ సంబంధిత వ్యాధులను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు, వ్యాయామం, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి చర్యలు కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు సహాయపడతాయి.