మీరు ఇష్టంగా తినే ఈ కూరగాయలే మిమ్మల్ని ఇబ్బంది పెడుతాయి జాగ్రత్త
ప్రస్తుత కాలంలో మలబద్ధకం అనేది చిన్నా పెద్దా ప్రతి ఒక్కరికీ ఎదురవుతున్న సమస్య. ఆహారపు అలవాట్లు, నీటి లోపం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో పాటు.. మనం తినే కొన్ని కూరగాయలు కూడా దీన్ని పెంచుతాయి. అలాంటి కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో మలబద్ధకం అనేది సాధారణమైన సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి వయస్సు వారిలో ఈ సమస్య కనిపిస్తోంది. తినే ఆహారంలో ఫైబర్, తగినంత నీరు, శారీరక చలనం లేకపోవడం వంటివే ప్రధాన కారణాలు. అయితే మనం ఇష్టంగా తినే కొన్ని కూరగాయలు కూడా మలబద్ధకాన్ని పెంచేలా పనిచేస్తాయని మీకు తెలుసా..? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయలో ఫైబర్ మంచి మోతాదులో ఉంటుంది. కానీ బెండకాయలో జిగట పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల కొందరికి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉండే వారు తరచూ ఈ కూర తింటే మలాన్ని గట్టిగా చేసి మలబద్ధకానికి దారి తీస్తుంది. తిన్న తర్వాత కడుపు నిండిపోయిన ఫీలింగ్, మలవిసర్జనలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు.
బ్రోకలీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ లాంటి కూరగాయలు క్రూసిఫెరస్ కుటుంబానికి చెందినవిగా గుర్తించవచ్చు. ఇవి పోషకాల పరంగా మేలైనవే అయినా.. కొంతమందికి గ్యాస్, ఉబ్బరం సమస్యలు తలెత్తేలా చేస్తాయి. ఇలా జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరిగితే మలబద్ధక లక్షణాలు కూడా తీవ్రమవుతాయి. అందుకే వీటిని ఆహారంలో మితంగా తీసుకోవడం ఉత్తమం.
క్యారెట్ అనేది ఫైబర్‌తో నిండి ఉండే కూరగాయ. అయితే క్యారెట్ ని ఎక్కువగా వండకుండా పచ్చిగా తినడం వల్ల కొందరికి జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్నా సరే శరీరానికి తగినంత నీరు అందకపోతే మలాన్ని గట్టిగా చేస్తుంది. ఇది మలబద్ధకం సమస్యకు దారితీసే అవకాశాన్ని పెంచుతుంది. ముఖ్యంగా పగలు సమయంలో నీరు తక్కువగా తాగేవారు జాగ్రత్తగా ఉండాలి.
సెలెరీలో కరగని ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొంతమందికి జీర్ణ సమస్యలను కలిగించే అవకాశం ఉంటుంది. అటువంటి వారికి సెలెరీ మలాన్ని గట్టిగా చేసి మలబద్ధకాన్ని పెంచుతుంది. సెలెరీ తీసుకునే వారు పీచు పదార్థాన్ని జీర్ణం చేసే శక్తి ఉన్నా లేకపోయినా.. నీరు తగినంతగా తీసుకోకపోతే మలవిసర్జన కష్టతరమవుతుంది.
ఈ కూరగాయలు అన్ని ఆరోగ్యానికి చెడు అనుకోవడం కాదు. కానీ కొంతమందికి శరీర లక్షణాలు, జీర్ణ వ్యవస్థ తేడాల వల్ల ఇవి సమస్యగా మారతాయి. అందుకే ఇలాంటి కూరలను తినేటప్పుడు నీటిని ఎక్కువగా తీసుకోవడం, పీచుతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్యను అరికట్టవచ్చు.




