స్మార్ట్ వాచ్ ల వాడకం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. స్మార్ట్ వాచ్ లతో ప్రయోజనాలు ఎక్కువుగా ఉండటంతో వాటిని ఉపయోగించేవారి సంఖ్య ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి కూడా స్మార్ట్ వాచ్ లు ఉపయోగపడుతుంటంతో వీటిని వాడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో స్మార్ట్ వాచ్ లో ఫీచర్స్ కూడా పెరుగుతున్నాయి. అయితే ఆరోగ్య సంబంధించిన విషయాలకు వచ్చేటప్పటికి కొన్ని పరిమితులు మాత్రం ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో స్మార్ట్ వాచ్ ద్వారా వచ్చిన ఫలితం పూర్తిగా కచ్చితమని చెప్పలేం అని నిపుణులు అంటున్నారు. ఆ సమయంలో స్మార్ట్ వాచ్ లో ఉన్న ఛార్జింగ్ పై కూడా ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే స్మార్ట్‌వాచ్‌లు వ్యక్తిలో కర్ణిక దడ (ఎ ఎఫ్ ఐ బి)ని గుర్తించగలవని పరిశోధకులు చెబుతున్నారు. అయినప్పటికీ, వాటి వినియోగానికి పరిమితులు ఉన్నాయని, వైద్య పరికరాలతో రోగనిర్ధారణ చేయడంతో పోలిస్తే స్మార్ట్ వాచ్ లు అంత కచ్చితమైన సాధనం కాదని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ వాచ్ ద్వారా మీలో రోగాన్ని గుర్తిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించి వారి అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. కెనడియన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం స్మార్ట్‌వాచ్‌లు కర్ణిక దడను గుర్తించగలవని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. కొంతమంది వ్యక్తులను పరిక్షించినప్పుడు యాపిల్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ కర్ణిక దడను కచ్చితంగా నిర్థారించినట్లు తేలిందన్నారు. ఎక్కువ మంది ఆరోగ్య నిపుణులు కూడా స్మార్ట్ వాచ్ సాంకేతికత ద్వారా వ్యాధి నిర్థారణను అంగీకరిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం స్మార్ట్ వాచ్ ల ద్వారా రోగాన్ని గుర్తించేటప్పుడు కొన్ని పరిమితులు మాత్రం ఉంటాయని ఈ అధ్యయనం వెల్లడించింది.
కర్ణిక దడతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన 734 మంది ఈసీజీ చేయించుకున్నారు. ఆతర్వాత 30 సెకన్లు యాపిల్ స్మార్ట్ వాచ్ లో ఈసీజీని రికార్డ్ చేశారు. అయితే కొంతమందిలో స్మార్ట్‌వాచ్‌ల ద్వారా పర్యవేక్షణ యొక్క ఖచ్చితత్వం ఇతర క్లినికల్ పద్ధతులతో సరిపోలడం లేదన్నారు. వాస్తవానికి స్మార్ట్ వాచ్ అనేది స్క్రీనింగ్ సాధనం, రోగనిర్ధారణ సాధనం కాదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. గతంతో పోలిస్తే ఫలితాలు మెరుగ్గా అందిచడంలో యాప్ లు మెరుగయ్యాయని, కాని మరింత కచ్చితత్వం అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వైద్య నిపుణులు.
స్మార్ట్ వాచ్ లేదా యాప్ లు ఉపయోగించి ప్రజలు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం ద్వారా వారి ఆరోగ్యం కోసం మరిన్ని చర్యలు తీసుకునేలా చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యక్తులు తమ లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవడానికి, ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంభించడానికి ఈ యాప్ లు దోహదపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పరికరాన్ని ఉపయోగించే విధానంపై కూడా ఫలితం ఆధారపడి ఉంటుందని తెలియజేస్తున్నారు. స్మార్ట్ వాచ్ ల ద్వారా కర్ణిక దడను గుర్తించగలవని పరిశోధనల్లో వెల్లడైనట్లు ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..