ఉదయాన్నే నిద్ర లేవాలని పెద్దలు చెబుతూంటారు. ఇప్పటకీ పల్లెటూర్లలో ఇదే ఆచరిస్తూంటారు. పని ఉన్నా లేకపోయినా.. ఏ సీజన్ అయినా కొంత మంది ఉదయాన్నే లేస్తారు. కానీ ప్రస్తుతం మాత్రం అర్థ రాత్రుళ్ల వరకూ ఫోన్లు, టీవీలు చూడటం.. ఉదయం 10 లేదా 11 గంటలకు లేవడం. ఇలా ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గుతారు:
ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల చాలా సమయం ఉంటుంది. అప్పటికప్పుడు లేచి హడావిడిగా వెళ్లటం కంటే.. కాస్త ముందు లేచి వ్యాయామం లేదా వాకింగ్ వంటివి చేయడానికి సమయం ఉంటుంది. ఇది బరువును అదుపులో ఉంచడానికి హెల్ప్ అవుతుంది.
నిద్ర లేమి సమస్య ఉండదు:
ఉదయాన్నే లేవడం వల్ల రాత్రి కూడా సమయానికి నిద్ర పడుతుంది. దీంతో నిద్ర నాణ్యత అనేది పెరుగుతుంది. దీని వల్ల సగం ఆరోగ్యం మన సొంతం అవుతుంది. నిద్ర సరిగా లేకపోతే ఎన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయో తెలిసిందే.
ఒత్తిడి తగ్గుతుంది:
సాధారణంగా ఉదయాన్నే లేవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి దూరం అవ్వొచ్చు. ఉదయం లేచి వాకింగ్ లేదా వ్యాయామం చేయడం వల్ల రిలాక్స్ గా ఉంటుంది. దీంతో మనం చేసే పనులపై ఏకాగ్రత పెరుగుతుంది. ఉదయపు వాతావరణం బ్రెయిన్ ను ప్రభావితం చేస్తుంది.
జీవక్రియ సరిగ్గా ఉంటుంది:
ఇప్పుడున్న బిజీ లైఫ్ లో కాల కృత్యాలు తీర్చుకోవడానికి సమయం ఉండటం లేదు. కానీ ఉదయాం లేవడం వల్ల కాల కృత్యాలు తీర్చుకోవడానికి సరైన సమయం దొరుకుతుంది. దీంతో పొట్ట క్లీన్ అవుతుంది. అలాగే సరైన సమయంలో తినడానికి కూడా సమయం ఉంటుంది. దీని వల్ల ఇతర ఉదర సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉండదు. కడుపులో గ్యాస్ వంటివి పెరగకుండా ఉంటాయి.
రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది:
ఉదయం నిద్ర లేస్తే ఎక్సర్ సైజ్ చేయడానికి సమయం దొరుకుతుంది. దీంతో బాడీలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీని వల్ల శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా గుండె హెల్దీగా ఉంటుంది.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.