Kidney Health: కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే వరకు చూడకండి.. ఈ 4 పరీక్షలు మీ ప్రాణాలను కాపాడుతాయి!

శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, రక్తాన్ని శుద్ధి చేసే కిడ్నీలు మన ఆరోగ్యానికి అత్యంత కీలకం. అయితే కిడ్నీ వ్యాధులను 'నిశ్శబ్ద హంతకులు' అంటారు. ఎందుకంటే ఇవి ముదిరే వరకు ఎలాంటి లక్షణాలు బయటపడవు. సరైన సమయంలో కొన్ని చిన్న పరీక్షలు చేయించుకోవడం ద్వారా మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఆ వివరాలు గురించి ఇప్పుడు చూద్దాం.

Kidney Health: కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే వరకు చూడకండి.. ఈ 4 పరీక్షలు మీ ప్రాణాలను కాపాడుతాయి!
Kidney Disease Prevention

Updated on: Dec 23, 2025 | 8:54 PM

ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 కోట్ల మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ ముప్పు మరీ ఎక్కువ. వ్యాధి ముదిరిన తర్వాత బాధపడటం కంటే, ప్రాథమిక దశలోనే కిడ్నీల ఆరోగ్యాన్ని ఎలా పరీక్షించుకోవాలో ఈ కథనంలో తెలుసుకోండి.
శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తూ, వ్యర్థాలను బయటకు పంపే కిడ్నీలు నిరంతరం శ్రమిస్తాయి.

కిడ్నీ వ్యాధులు ప్రారంభంలో ఎలాంటి లక్షణాలను చూపవు. వ్యాధి తీవ్రమై కిడ్నీలు దెబ్బతిన్న తర్వాతే చాలామందికి ఈ విషయం తెలుస్తుంది. అందుకే ముందస్తుగా కొన్ని సాధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ముప్పు పెంచుతున్న కారకాలు ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు 13.4 శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా టైప్-2 మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, వయసు పెరగడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. ఈ వ్యాధుల తీవ్రతను గుర్తించేందుకు కిడ్నీ నిపుణులు సూచిస్తున్న కీలక పరీక్షలు ఇవే..

1. రక్త పరీక్ష (Creatinine/eGFR): రక్తంలో ఉండే వ్యర్థాలను కిడ్నీలు ఎంతవరకు శుద్ధి చేస్తున్నాయో ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. ‘ఈజీఎఫ్ఆర్’ (eGFR) విలువ 90 కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయని అర్థం. ఈ విలువ తగ్గితే కిడ్నీ పనితీరు మందగిస్తున్నట్లు గుర్తించాలి.

2. మూత్ర పరీక్ష (Microalbumin/ACR): మూత్రంలో ప్రోటీన్ లేదా అల్బుమిన్ అనే అంశాలు బయటకు వస్తున్నాయో లేదో దీని ద్వారా తెలుస్తుంది. ఆరోగ్యంగా ఉన్న కిడ్నీలు ప్రోటీన్లను బయటకు పంపవు. మూత్రంలో అల్బుమిన్ స్థాయి అధికంగా ఉంటే అది కిడ్నీ దెబ్బతినడానికి తొలి సంకేతం. ఈ పరీక్ష కోసం ఉదయాన్నే రెండోసారి వచ్చే మూత్ర నమూనాను ఇవ్వడం మంచిది.

3. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్: దీనిని యూరినాలసిస్ అని కూడా పిలుస్తారు. ఇందులో మూత్రం రంగు, అందులోని గ్లూకోజ్, రక్తం, బ్యాక్టీరియా స్థాయిలను పరిశీలిస్తారు. కిడ్నీలో ఇన్ఫెక్షన్లు లేదా రాళ్లు ఉన్నాయా అనే విషయం ఈ పరీక్షతో స్పష్టమవుతుంది.

4. అల్ట్రాసౌండ్ స్కానింగ్: పొట్ట భాగంలో అల్ట్రాసౌండ్ పరీక్ష చేయడం వల్ల కిడ్నీల నిర్మాణం, పరిమాణం తెలుస్తుంది. కిడ్నీలో ఏవైనా అడ్డంకులు ఉన్నా, ఇన్ఫెక్షన్లు పెరిగినా ఈ స్కాన్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.

కిడ్నీ వ్యాధులను తొలి దశలో గుర్తిస్తే సరైన చికిత్సతో పరిస్థితి విషమించకుండా అడ్డుకోవచ్చు. అందుకే ఏటా కనీసం ఒక్కసారైనా ఈ పరీక్షలు చేయించుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

గమనిక: ఈ కథనంలోని అంశాలు కేవలం సమాచార అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం ఉత్తమం.