మీ వంటింట్లోని నల్ల బంగారం.. నల్ల మిరియాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!
నల్ల మిరియాలు కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి సహజ ఔషధంగా పని చేస్తాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచడం నుంచి మానసిక ప్రశాంతత వరకూ ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. ప్రతిరోజూ మన ఆహారంలో నల్ల మిరియాలను చేర్చితే ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుంది.

నల్ల మిరియాలు ఆహారానికి రుచిని మాత్రమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది కేవలం మసాలా దినుసు కాదు.. మన శరీరానికి అవసరమైన ఒక సహజ ఔషధం. ఇప్పుడు నల్ల మిరియాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం.
అద్భుతమైన జీర్ణశక్తి
నల్ల మిరియాల్లో ఒక ప్రత్యేక గుణం ఉంది. ఇది మన శరీరంలో జీర్ణరసాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల మనం తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. గ్యాస్, అజీర్తి, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఆహారం శరీరానికి బాగా పడుతుంది.
పోషకాల శోషణకు తోడు
ఈ మిరియాల్లో పైపరైన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మనం తినే ఇతర ఆహారాల్లోని పోషకాలను శరీరం సులభంగా పీల్చుకోవడానికి సాయపడుతుంది. ఉదాహరణకు పసుపులోని కర్కుమిన్ లాంటివి బాగా ఒంటబడతాయి. ఇది మన ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్
శరీరంలోని కొవ్వును కరిగించే ప్రక్రియను నల్ల మిరియాలు వేగవంతం చేస్తాయి. జీవక్రియ చురుకుగా పని చేయడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. దీని వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక సహజ మార్గంగా ఉపయోగపడుతుంది.
వాపు నిరోధకాలు
నల్ల మిరియాలకు సహజంగానే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో వచ్చే వాపును, నొప్పిని తగ్గించడంలో సాయపడతాయి. ఇది కీళ్ళు ఆరోగ్యంగా పని చేయడానికి దోహదపడుతుంది.
శ్వాస సమస్యలకు ఉపశమనం
ఇవి ముక్కులో చేరిన శ్లేష్మాన్ని సులభంగా బయటకు పంపడానికి సాయపడతాయి. జలుబు, దగ్గు వచ్చినప్పుడు శ్వాస మార్గాన్ని శుభ్రం చేసి ఉపశమనం కలిగిస్తాయి.
హానికర క్రిముల నుంచి రక్షణ
నల్ల మిరియాల్లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని హానికర బ్యాక్టీరియా నుంచి కాపాడతాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి.
మెదడుకు నల్ల మిరియాలు
ఈ మసాలా దినుసులో ఉండే పైపరైన్ పదార్థం నరాల వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మతిమరుపు రాకుండా చూడటం.. చురుకుదనం పెరగడం వంటి లాభాలు దీని వల్ల కలుగుతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇది సాయపడుతుంది.
శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్
నల్ల మిరియాల్లో శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ ను ఎదుర్కొనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీని వల్ల కణాలు దెబ్బతినకుండా రక్షించబడతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.
షుగర్ కి నల్ల మిరియాలు
కొంతమంది పరిశోధకుల ప్రకారం నల్ల మిరియాలు శరీరం ఇన్సులిన్ కు బాగా స్పందించేలా చేస్తాయి. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను స్థిరంగా ఉంచడానికి సాయపడుతుంది. షుగర్ ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
మానసిక ప్రశాంతత
నల్ల మిరియాలు శరీరంలో సెరోటోనిన్, డోపమైన్ వంటి ఆనందాన్ని కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. దీని వల్ల మనసుపై మంచి ప్రభావం పడుతుంది. ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత వస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




