నటుడు మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాధవన్ నటుడిగానే కాకుండా రచయిత, దర్శకుడిగా కూడా మారిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ వంటి పలుభాషల్లో ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. కాగా మాధవన్ ఇటీవల బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు వెళ్లాడు. అక్కడ కొత్తగా తెరిచిన టెర్మినల్‌లో మౌలిక సదుపాయాలను చూసి తెగ సంభరపడిపోయాడు. అక్కడి విలాసవంతమైన గార్డెన్‌లో అంతర్జాతీయ టెర్మినల్ గురించి ప్రశంసిస్తూ ఈ వీడియో తీశాడు. దేశంలోనే బెస్ట్ ఇన్‌ఫ్రాస్రక్చర్ అని తన వీడియోలో చెప్పుకొచ్చాడు.
‘మన దేశంలో మౌలిక సదుపాయాలు ఎలా మారుతున్నాయనేది నమ్మశక్యం కావట్లేదు! నేను కెంపెగౌడ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నాను. ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి మీకు చెప్తున్నాను. ఇది విదేశీ ఎర్‌పోర్ట్‌లా కనిపిస్తుంది. ఇది ఇండియన్ ఎయిర్ పోర్టని ఎవరూ నమ్మలేరు. ఇక్కడ ఉన్న మొక్కలన్నీ విమానాశ్రయంలో కప్పుపై భాగాల నుంచి కిందికి వేలాడుతున్నాయి. ఇవి నిజమైన మొక్కలు. సీలింగ్ నుంచి ప్రతిరోజు ఈ మొక్కలకు నీళ్లు అందుతాయి. మీరు చూస్తున్న అన్ని నిర్మాణాలు వెదురుతో తయారు చేశారు. పైకప్పును చూడండి. ఇది భారత్‌లో స్థిరత్వం చుట్టూ ఉన్న నేపథ్యం. చాలా గర్వంగా ఉంది! వెరీ వెల్‌డన్ మ్యాన్’ అంటూ ప్రధాని మోదీని వీడియోలో ప్రసంశించాడు. అంతేకాకుండా అక్కడి మౌలిక సదుపాయాల గురించి వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశాడు.
మాదవన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరొక వీడియోను కూడా పంచుకున్నాడు. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, అందులోని మౌలిక సదుపాయాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి. సో ఫ్రౌడ్ అని ప్రశంశించాడు. ఈ రెండు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 5 లక్షల లైకులు, మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చిపడ్డాయి. ఇక మాదవన్ వీడియోపై ప్రధాని మోదీ స్పందించారు. దేశ అభివృద్ధికి నెక్ట్స్ జెనరేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇక బెంగుళూరు విమానాశ్రయాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. విదేశీ ఎయిర్ పోర్టుల కంటే ఇండియన్ విమానాశ్రయాలు చాలా మెరుగ్గా ఉన్నాయి’, ‘మీ ఉనికి ఈ స్థలాన్ని మరింత అందంగా మార్చింది’, ‘నిజమే. ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయం’ అంటూ కామెంట్లు పెట్టారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.