ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు మూవీ లిరిసిస్ట్ చంద్రబోస్ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా, రవితేజ ప్రధానపాత్రలో నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ సాంగ్ ఇటీవలే సోషల్ మీడియాలో విడుదలై సెన్సేషన్ గా మారింది. అయితే, ఈ సాంగ్ విషయంలో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ పాట రాసిన లిరిక్ రైటర్ ఎవరంటూ యండమూరి చేసిన కామెంట్స్‌పై.. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ రాసిన చంద్రబోస్ ఘాటుగా స్పందించారు. అర్థం తెలియకుండా మాట్లాడే వాళ్లకు.. చెప్పినా అర్థం కాదంటూ కౌంటర్ ఇచ్చారు. పాటలో తుఫాన్ అంచున తపస్సు చేసే వశిష్టుడే వీడే.. తిమిరనేత్రమై ఆవతరించిన త్రినేత్రుడే.. ఈ పదాలు వాడుతూ.. అసలు ఈ పాట రాసిన వాడికి పురాణకథలు తెలుసా.. అతడేం చదివాడు.. తిమిరము అంటే అర్థం తెలుసా నీకు..? శివదూషణ కాదా ఇది.. ఏమిటీ పిచ్చి రాతలు.. తెలుగు సిని కవిత్వం వేటూరి మరణంతో మసకబారి దీపం అయింది.. సిరివెన్నెల మరణం ఆ కాస్త దీపాన్ని ఆర్పేసింది అంటూ యండమూరి పోస్ట్ చేశారు.
దీనికి కౌంటర్ గా చంద్రబోస్ స్పందిస్తూ..తాను ఏ ఉద్దేశ్యంతో ఈ పాటలోని పదాలు వాడాల్సి వచ్చిందో వివరించారు. తను శివదూషణ చేయలేదని, హీరో పాత్ర స్వభావాన్ని మాత్రమే అందులో ప్రతిబింబించేలా పదాలు రాశానని తెలిపారు. చిరంజీవి గారూ, సత్యానంద్ గారూ పాట విన్న తర్వాత.. ఇది అధ్యయనం చేయాల్సిన పాట అంటూ ప్రశంసించారని తెలిపారు. తాజాగా మరోసారి యండమూరి చంద్రబోస్ కు కౌంటర్ ఇచ్చారు.
2×2= 3 అన్న నీ అభిప్రాయం పట్ల నీకు ఎంత నమ్మకం ఉన్నదీ, 2×2 = 5 అని నీతో వాదించే వారికి కూడా తమ అభిప్రాయాల పట్ల అంతే నమ్మకం ఉంటుందని గ్రహించిన రోజు, నువ్వు వాదనలతో సమయం వృధా చేసుకోవు. మూర్ఖుడు వాదిస్తాడు. మేధావి చర్చిస్తాడు. జ్ఞాని నవ్వి ఊరుకుంటాడు. నీ గురించి ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారంటే, వారికి ఇంకో సబ్జెక్టు గురించి మాట్లాడే జ్ఞానం లేదన్నమాట. (ప్రస్తుతం రాస్తున్న పుస్తకం నుంచి). అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.