
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించిన చిత్రం విరూపాక్ష. ఎలాంటి అంచనాలను క్రియేట్ చేయకుండానే ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా ఇందులో సాయి ధరమ్, సంయుక్త, రాజీవ్ కనకాల నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాపై అటు సినీప్రియులు.. ఇటు సెలబ్రెటీలు ప్రశంసలు కురిపించారు. తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈసినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పరుచూరి పాఠాలు పేరుతో సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే ఛానల్లో విరూపాక్ష సినిమాకు రివ్యూ ఇచ్చారు.
“చిన్న పల్లెటూరిలో జరిగే ఓ కథను అద్భుతంగా రూపొందించారు. ఇప్పటికాలంలో ఒక సినిమా రెండు లేదా మూడు వారాలు ఉండటమనేది చాలా గొప్ప విషయం.. అలాంటి సమయంలో విరూపాక్ష ఏకంగా రూ.100 కోట్లు రాబట్టిందంటే.. ఈ సినిమాను ప్రేక్షకులను ఎన్ని రోజులు చూశారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకు రచయిత ప్రభాకర్ అందించిన మాటలు చాలా సహజంగా ఉన్నాయి. డైలాగ్స్ రాయడంలో సినీ పరిశ్రమలో ఒక్కొక్కరిది ఒక్క శైలి. ఈ సినిమాలోని ప్రతి డైలాగ్ ప్రభాస్ చాలా శ్రద్ధగా రాశారు. విచిత్రమైన కథతో ప్రేక్షకులను అలరించారు. ప్రేమించిన అమ్మాయి కోసం ఊరి సమస్యను ఒక హీరో ఎలా పరిష్కరించారో చూపించిన తీరు అద్భుతం. ఒక చిన్న కథతో రెండున్నర గంటలపాటు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతినిచ్చారంటే అది మాములు విషయం కాదు. దర్శకుడిని కచ్చితంగా అభినందించాల్సిందే.
ఈ సినిమాలో తాంత్రిక పూజలు, భయపెట్టే సన్నివేశాలు ఉన్నాయి.. అందుకే జనాలు చూశారు అనుకుంటే పొరపాటే.. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి ప్రధాన కారణం కథే. అలాగే స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. సాంఘిక ఇతివృత్తంలో ఇలాంటి కథను ఎంపిక చేసుకుని సుకుమార్ సహయంతో కార్తీక్ దండు అద్భుతాన్ని సృష్టించాడు. కథను చాలా మంది రాస్తారు. కానీ కథనాన్ని చాలా తక్కువ మంతి మాత్రమే రాయగలుగుతారు. ఈ సినిమాలు కార్తీక్ దండు, సాయి ధరమ్ తేజ్, సంయుక్త, అజయ్, వీళ్ల నలుగురికి మంచి మార్కులు వేయొచ్చు. వీరివల్ల సినిమాలో అనుక్షణం ఉత్కంఠ కలిగింది. సినిమా చివరిదాగా విలన్ ఎవరనేది తెలియకుండా ఉత్కంఠను రేకెత్తించారు. ఇంకా సినిమాలో రాజీవ్ కనకాల పాత్ర పెద్ద ట్విస్ట్. సినిమాలో అవసరమైనంతవరకే సంభాషణలు ఉంటే చాలా సహజసిద్ధంగా ఉంటుందని రానున్న కాలంలో ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లు తెలుసుకోవాలి. అలాగే ఇందులో హీరోయిన్ సంయుక్త నటన ఆశ్చర్యం కలిగించింది.”అంటూ పరుచూరి చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.