kona venkat: హీరోలకు పాన్ ఇండియా మోజు ఎక్కువైంది.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్
కోన వెంకట్ తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోల పాన్ ఇండియా మోజుపై మాట్లాడారు. మంచి కథలు లేవనే వాదనను తోసిపుచ్చారు. రచయితల ప్రాముఖ్యత తగ్గి, దర్శకులుగా మారుతున్నారని పేర్కొన్నారు. రచయితలకు తగిన గుర్తింపు, పారితోషికం లభించకపోవడం వల్ల ఈ ధోరణి ఏర్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, ముఖ్యంగా స్టార్ హీరోల ప్రాజెక్ట్ ఎంపికలు, రచయితల తగ్గుతున్న ప్రాధాన్యతపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కామ్రేడ్ కళ్యాణ్ సక్సెస్ మీట్‌లో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. స్టార్ హీరోలు గతంలో మాదిరిగా ఎక్కువ సినిమాలు చేయకపోవడంపై ప్రశ్నించగా.., కోన వెంకట్ దీనికి ప్రధాన కారణం పాన్ ఇండియా మోజు అని స్పష్టం చేశారు. మంచి కథలు దొరకడం లేదన్న హీరోల వాదనను ఆయన పూర్తిగా ఖండించారు. కథలు లేవు, రావట్లేదన్నది నేను ఒప్పుకోను. నాకు అవకాశం ఇస్తే, ప్రతి హీరో దగ్గర కొంతమంది కొత్త డైరెక్టర్లను, రీసెంట్‌గా వచ్చిన డైరెక్టర్లను ప్రతి వీకెండ్ తీసుకెళ్లి కూర్చోబెట్టగలను విత్ స్టోరీ” అని ఆయన బలంగా చెప్పారు. హీరోలు కేవలం లార్జర్ దెన్ లైఫ్ కథలు, భారీ వసూళ్లు, పాన్ ఇండియా, పాన్ వరల్డ్, హాలీవుడ్ స్థాయి లక్ష్యాలతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
అయితే, “పుష్ప”, “బాహుబలి” వంటి సినిమాలు ముందుగా తెలుగు భాషలోనే రూపొంది, ఆ తర్వాతే అల్టిమేట్‌గా పాన్ ఇండియా విజయాలుగా నిలిచాయని ఆయన గుర్తుచేశారు. కన్నడ చిత్రమైన “కాంతారా”ను కూడా ఆ భాష పరిశ్రమ కోసమే తీశారని, అది ప్రపంచవ్యాప్తంగా విజయం సాధిస్తుందని తీసినప్పుడు వారు ఊహించలేదని తెలిపారు. “కనీసం మన భాష వరకు మనం పరిమితం అయ్యి మన ఆడియన్స్‌ని.. మన ఆడియన్స్‌కి దూరం అయిపోయి, వాళ్ళు ఇంక పక్క భాషకి వెళ్ళిపోయి లేకపోతే ప్రపంచమంతా వెళ్ళిపోదాం అనడం కరెక్ట్ కాదేమో” అని ఆయన అన్నారు. ముందుగా తమ సొంత భాషా ప్రేక్షకులకు న్యాయం చేయాలని ఆయన సూచించారు.
తెలుగు సినీ పరిశ్రమలో రచయితల పాత్ర క్రమంగా తగ్గుముఖం పట్టడంపై కోన వెంకట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో రచయితలంటూ ఒక ప్రత్యేక విభాగం ఉండేదని, ఇప్పుడు దర్శకులే రచయితలుగా కూడా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. త్రివిక్రమ్, కొరటాల శివ, బాబీ, హరీష్ శంకర్ వంటి దర్శకులందరూ మొదట రచయితలుగానే తమ కెరీర్‌ను ప్రారంభించారని, వారంతా తన అసిస్టెంట్లుగా పనిచేశారని కోన వెంకట్ గుర్తు చేసుకున్నారు. “వీళ్ళందరినీ చూసిన తర్వాత డైరెక్షన్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను,” అని ఆయన అన్నారు. అదేవిధంగా దర్శకులకు ఉన్న గౌరవం, పారితోషికం రచయితలకు లభించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. “డైరెక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికీ ఎందుకు ఇంత ఇవ్వాలి అని బేరం ఆడతారు, రైటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికీ… ఇక వాళ్లు ఒకరోజు జూనియర్ ఆర్టిస్టులకి పెట్టే ఖర్చు రైటర్ రెమ్యూనరేషన్ ఉంటది” అని ఆయన అన్నారు. ఒకరోజు షూటింగ్ కోసం 2000-3000 మంది జూనియర్ ఆర్టిస్టులకు పెట్టే ఖర్చుతో ఇద్దరు రచయితలను నియమించుకోవచ్చని ఆయన అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



