Allu Arjun arrest: బన్నీకి బెయిల్ ! వాదించిన న్యాయవాది ఎవరో తెలుసా ? ఆయన లేవనెత్తిన లా పాయింట్స్ ఎంటి?

| Edited By: Ram Naramaneni

Dec 13, 2024 | 10:01 PM

అల్లు అర్జున్‌‌కు బెయిల్ వచ్చింది. అయితే ఈ కేసులో బన్నీ తరఫున వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం పదండి....

Allu Arjun arrest: బన్నీకి బెయిల్ ! వాదించిన న్యాయవాది ఎవరో తెలుసా ? ఆయన లేవనెత్తిన లా పాయింట్స్ ఎంటి?
Allu Arjun Lawyer
Follow us on

బన్నీకి బెయిల్ వచ్చేసింది. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించగా… హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన వెంటనే… నేరుగా అల్లు అర్జున్‌ను చంచల్ గూడ జైలుకు తీసుకువెళ్ళారు. అప్పటికే హైకోర్టులో క్వాష్‌, మధ్యంతర బెయిల్‌పై వాదనలు జరుగుతున్నాయి. హై కోర్టులో అల్లు అర్జున్ తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి కేసును బలంగా వాదించారు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య ధియేటర్ వద్ద పుష్ప 2 సినిమా చూడటానికి వచ్చిన మహిళా తొక్కిసలాటలో మృతి చెందిన కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో బన్నీకి బెయిల్ తీసుకురావడానికి హై కోర్టులో న్యాయవాది నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.

నిర్మల్ నుంచి ఢిల్లీ దాకా..

బన్నీ కేసులో వార్తల్లో నిలిచిన నిరంజన్ రెడ్డిది నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం సిర్గాపూర్ గ్రామం. 1970 జులై 22న ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణంలో విద్యాసాగర్ రెడ్డి, విజయ లక్ష్మి దంపతులకు ఆయన జన్మించారు.  నిరంజన్ రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నత విద్య పూర్తి చేసి పుణెలోని సింబయాసిస్‌ లా కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నిరంజన్ రెడ్డి ఆచలంచలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదులు మనోహర్‌రెడ్డి, ప్రతాప్‌ రెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశారు. రాజ్యాంగపరమైన అంశాలతో పాటు వేర్వేరు చట్టాలపై నిరంజన్ రెడ్డికి గట్టి పట్టుంది. 1992 నుంచి హైకోర్టులో, 1994 నుండి సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. 2016లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయనకు సీనియర్‌ న్యాయవాది హోదా లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తరఫున పలు కేసుల్లో స్పెషల్‌ సీనియర్‌ కౌన్సిల్‌గా పని చేశాడు. వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా పనిచేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి CBI కేసులను వాదించారు. అనేక కీలకమైన కేసుల్లో మంచి సక్సెస్ రేట్ కల్గిన అడ్వకేట్‌గా పేరు సాధించారు.

అల్లు అర్జున్ కేసులో అనేక అంశాలను న్యాయమూర్తి ముందు వాదించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో బండి సంజయ్‌ను అరెస్టు చేసినప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గోదావరి పుష్కరాల సందర్భంలో ఏపీ సిఎం చంద్రబాబు వెళ్తే అక్కడ 30 మందికి పైగా చనిపోయిన విషయాన్ని న్యాయమూర్తి ముందు పెట్టారు. ఇలా అనేక లాజిక్ పాయింట్స్‌తో కేసును వాదించి బన్నీకి బెయిల్ తీసుకువచ్చారు.

ఒకవైపు న్యాయవాదిగానే కాకుండా సినీ నిర్మాతగా నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు నిరంజన్ రెడ్డి. దిల్ రాజుకు చెందిన వెంకటేశ్వర క్రియేషన్స్‌కు అనుబంధంగా  2002లో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్  సంస్థను స్థాపించారు. ఈ సంస్థ 2010లో మరో చరిత్ర, 2011లో గగనం సినిమాలను నిర్మించి ఆ తరువాత, పూర్తిస్థాయి సినీ నిర్మాణ సంస్థగా ఏర్పడి, 2016లో క్షణం, 2017లో ఘాజీ వంటి అవార్డు పొందిన సినిమాలను నిర్మించారు.

న్యాయవాది, సినీ నిర్మాతగానే కాదు ఆయన రాజకీయ నాయకుడిగా కూడా అందరికి సుపరిచితం. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డిని 2022 మే 17న వైఎస్సార్‌సీపీ రాజ్యసభకు అభ్యర్థిగా ఎన్నిక చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుభవం ఉన్న న్యాయ నిపుణుల్లో ఈయనకు.. కీలక కేసులను వాదించిన అనుభవమూ ఉండటంతో వైసిపి నిరంజన్ రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసింది వైఎస్సార్‌సీపీ.

మొత్తంగా సినీ నిర్మాతగా.. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నిరంజన్ రెడ్డి.. కీలకమైన సందర్భంలో న్యాయవాదిగా వాదించి అల్లు అర్జున్‌కి బెయిల్ ఇప్పించి మ్యాన్ ఆఫ్ ది డేగా నిలిచారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.