Vijay Deverakonda: సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. ఆసక్తికర కారణాలు చెప్పిన హీరో విజయ్ దేవరకొండ
టాలీవుడ్ రౌడీ బాయ్ సత్య సాయిబాబాను బాగా ఆరాధిస్తారు. చిన్నప్పటి నుంచే పలు సార్లు సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శించారు. అయితే తాజాగా తన రణబాలి సినిమా ప్రమోషన్లలో సత్య సాయిబాబా బయోపిక్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు హీరో విజయ్ దేవరకొండ

టాలీవుడ్ రౌడీ బాయ్, హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘రణబాలి’. గతంలో విజయ్ తో కలిసి ట్యాక్సీవాలా వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ మరోసారి విజయ్ తో కలిసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. టీ సిరీస్ సమర్పణలో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. విజయ్- రష్మిక వరుసగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ దేవరకొండ రణబాలి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో తన రాబోయే సినిమాల లైనప్ గురించి మాట్లాడారు. ‘మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలనే ఆలోచనతోనే ‘రణబాలి’ సినిమాను తీశాం. అనంతపురంలో జరిగే ఓ జాతరలో కొంతమంది వీరుల గురించి విన్న బుర్రకథల ఆధారంగా దర్శకుడు రాహుల్ ఈ కథను రెడీ చేశారు. ‘రణబాలి’ ఓ బుర్రకథతోనే ప్రారంభం అవుతుంది. మన దేశ భవిష్యత్ గురించి మనం ఆలోచించాలంటే చరిత్ర తెలుసుకోవడం ముఖ్యం. మన చరిత్రలో మనకు తెలియకుండా రహస్యంగా మిగిలిపోయిన అధ్యాయాలను సినిమా మాధ్యమం ద్వారా వెలికి తీసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇది కూడా అలాంటి ప్రయత్నమే’ అని చెప్పుకొచ్చారు విజయ్
కాగ ఇదే సందర్భంగా బయోపిక్స్ చేయడంపైనా తన ఆలోచలను పంచుకున్నారు విజయ్. ‘బయోపిక్ చేయాలనే ఆకాంక్షనాకూ ఉంది. అయితే సత్య సాయిబాబా బయోపిక్‌కు నేను న్యాయం చేయలేను. అందుకు కారణం ఆయనలో ఉన్న స్వచ్ఛత, సున్నితత్వం నాలో లేవన్నది నా ఫీలింగ్. నేను చేయగలిగే బయోపిక్‌లు వస్తే తప్పక చేస్తాను. అందులో ఎలాంటి డౌట్ లేదు’ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. రణబాలి సినిమా విషయానికి వస్తే.. రాయలసీమలో బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు, కరవు, దోపిడీల నేపథ్యంలో మరుగున పడిన ఒక వీరుడి గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లో కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అజయ్- అతుల్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




