లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), దర్శకుడు విఘ్నేష్ శివన్(Vignesh)ఒక్కటయ్యారు. విఘ్నేష్ తో కలిసి నయన్ ఏడడుగులు నడిచారు. చాలా రోజులుగా ప్రేమలో తేలిపోతున్న ఈ జంట నేడు వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం నేడు తెల్లవారుజామున 2.22 నిమిషాలకు జరిగినట్టు తెలుస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం పుణ్యక్షేతమైన మహాబలిపురం నయన్ , విఘ్నేష్ వివాహం జరిగిందని సమాచారం. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల నడుమ నయన్ , విఘ్నేష్ ఒక్కటయ్యారు. నయనతార, విఘ్నేష్ శివన్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ జంట చట్టపట్టాలేసుకుంటూ తిరుగుతూ పలుసార్లు మీడియా కంట పడ్డారు. ఆ సమయంలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆసమయంలో ఇద్దరూ పెళ్లి పై స్పందించడానికి ఇష్టపడలేదు. సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోయారు. ఎట్టకేలకు ఈ జంట పెళ్లిపీటలెక్కారు.
ఈ విషయాన్నీ విఘ్నేష్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ.. నా జీవితంలో ఉన్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, స్నేహం..నా జీవితాన్ని ఇంత అందంగా మార్చింది ! మీ ప్రేమకురుణపడి ఉంటాను! నా జీవితంలోని ప్రేమ అంతా నయనతారకు అంకితం! అందరికీ మంచి జరగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.
మా ప్రియమైన కుటుంబం, మంచి స్నేహితుల ముందు అధికారికంగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. అంటూ విఘ్నేష్ సోషల్ మీడియాలో నయనతారతో కలిసున్నా ఫోటోలను షేర్ చేశాడు. ఈ పోస్ట్ పై అభిమానులు, పలువురు సినిమా తారలు స్పందిస్తూ.. నయన్ , విఘ్నేష్ కు విషెస్ తెలుపుతున్నారు.