ఆ రోజు బాలయ్య బాబు ఫోన్ చేసి డాక్టర్స్‌తో మాట్లాడారు.. ఆసక్తికర విషయం చెప్పిన వేణుమాధవ్
దివంగత నటుడు వేణు మాధవ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మారోసారి వైరల్ అవుతున్నాయి. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఎవరికీ మస్కాలు కొట్టనని ఆయన అన్నారు. కేసీఆర్, చంద్రబాబు, బాలకృష్ణ వంటి ప్రముఖులతో తనకున్న అనుబంధాన్ని వివరించారు.

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నటుడు వేణు మాధవ్, ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించిన వేణుమాధవ్ మరణాన్ని ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు వేణుమాధవ్. తాజాగా వేణు మాధవ్ కు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, రాజకీయ సంబంధాలు, అలాగే సినీ ప్రయాణం గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన వ్యక్తిగత జీవితానికి వస్తే, వేణు మాధవ్ జూబ్లీహిల్స్, ఫిలిం నగర్ వంటి ప్రాంతాల్లో కాకుండా మౌలాలి హౌసింగ్ బోర్డు, మంగాపురం కాలనీలో నివసించడానికి కారణాన్ని వివరించారు. తన కుటుంబం, తల్లి, అన్నయ్యలు, అక్క, చెల్లి అంతా అక్కడే నివసిస్తున్నారని, అందుకే తాను కూడా అక్కడే ఉండాల్సి వచ్చిందని చెప్పారు.
తనకంటూ ఫిలిం నగర్‌లో భూమి ఉన్నప్పటికీ, షూటింగ్‌లకు వెళ్లడానికి ఒక గంట ముందు బయలుదేరితే సరిపోతుందని ఆయన అన్నారు. సాధారణ ప్రజలలో కలిసి ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందీ ఉండదని, తన ప్రాంతానికి తాను మెగాస్టార్ అని, స్థానికంగా జరిగే ఏ కార్యక్రమానికైనా తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని వేణు మాధవ్ తెలిపారు. డిస్కోథెక్, పబ్‌లు, క్లబ్‌లకు వెళ్లే అలవాటు తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.
తన జీవితంలో అత్యంత విషాదకర సంఘటనగా తన తండ్రి మరణాన్ని వేణు మాధవ్ పేర్కొన్నారు. పదహారు సంవత్సరాల క్రితం బాలయ్య బాబు సినిమా షూటింగ్‌లో వి.వి. వినాయక్ గారి దర్శకత్వంలో తాను గాంధీపేటలో ఉన్నప్పుడు తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఆసుపత్రికి తరలించగా గుండెపోటు వచ్చిందని వైద్యులు చెప్పారని, ఆసమయంలో బాలయ్య బాబుకు ఈ విషయం తెలిసి.. వెంటనే కేర్ ఆసుపత్రికి ఫోన్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారని వేణు మాధవ్ వెల్లడించారు. రెండు మూడు రోజుల తర్వాత తండ్రి కన్నుమూశారని, ఆ సంఘటన తనను ఎంతగానో కలచివేసిందని భావోద్వేగంతో చెప్పారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




