
సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారు ఎక్కువగా ఇంటికే పరిమితమవుతారు. వృద్ధాప్య సమస్యలు, ఒళ్లు నొప్పులంటూ పెద్దగా బయటకు వెళ్లరు. చిన్న చిన్న పనులకు కూడా ఇతరుల సాయం తీసుకుంటుంటారు. కానీ కొందరు మాత్రం 60 ఏళ్ల వయసులోనూ సాహసాలు చేస్తుంటారు. యువకులకు కూడా సాధ్యం కానీ పనులు సైతం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. వీరి దృష్టిలో ఏజ్ జస్ట్ ఒక నంబర్ మాత్రమే. అలాంటి సాహస నారీమణుల లిస్టులో ఈమె కూడా కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతోన్న స్టార్ హీరోకు అత్తయిన ఆమె 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా సాహసాలు చేస్తున్నారు. వృతి పరంగా మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ ఆమెకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే తన 60 పుట్టిన రోజు సందర్భంగా ఏకంగా 600 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసింది. మోకాలికి ఆపరేషన్ అయినా, నెక్ లో ప్లేట్స్ ఉన్నా, ఇంకా పలు గాయాలు ఉన్నా తనకు తాను ఛాలెంజింగ్ గా తీసుకొని హైదరాబాద్ నుంచి చెన్నైకు సైకిల్ పై ప్రయాణం చేశారు. ఇలా సాహస యాత్రతో అందరి మన్ననలు అందుకున్న ఆమె మరెవరో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అత్త, ఉపాసన తల్లి శోభనా కామినేని.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభనా కామినేని వరల్డ్ సైక్లింగ్ డే సందర్భంగా ఒక ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. అందులో 2023లో హైదరాబాద్ నుంచి చెన్నై సైకిల్ రైడ్ చేశాననే విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పోస్ట్ ప్రకారం.. ఎలాంటి హడావిడి లేకుండా, ఏ మెడల్ కోసం, ఏదైనా మూమెంట్ కోసం కాకుండా ఉపాసన తల్లి శోభన హైదరాబాద్ లోని తన ఇంటి వద్ద నుంచి చెన్నైలోని తన తల్లితండ్రుల ఇంటి వరకు సైక్లింగ్ చేస్తూనే వెళ్లారట. సుమారు 600 కిలోమీటర్లు సైకిల్ మీదే వెళ్లారట. ఈ పోస్టుకు ఉపాసన కూడా స్పందించింది.. ‘అమ్మ.. నీ ఛాలెంజ్‌ల వల్ల నా ఒత్తిడి అంతా తగ్గిపోతోంది’ అని తల్లిపై ప్రశంసలు కురిపించింది ఉపాసన.
ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఉపాసన తల్లి గట్స్ కు సినీ అభిమానులు, నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.