బాలీవుడ్‌పై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ అధిపత్యంపై నిప్పులు చెరిగారు. అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలను తొక్కేసి.. కేవలం హిందీ సినిమాలకు మాత్రమే ఉత్తర భారతదేశంలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఇది భారతీయ సినిమా ఇండస్ట్రీకి అంత మంచిది కాదన్నారు. దక్షిణాదిలో తమిళం, తెలుగు, కన్నడతో పాటు మలయాళం చిత్ర పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయని… ఉత్తరాదిలో కేవలం బాలీవుడ్ ఆధిపత్యం నడుస్తోందని ఆరోపించారు.
ఇతర భాషలైన మరాఠీ, బిహారి, భోజపురి, హర్యానా, గుజరాత్ భాషల సినిమాలని హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ తొక్కేస్తుందని మండిపడ్డారు. ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలకు కనీసం సొంత చిత్ర పరిశ్రమలే లేవని.. ఈ స్థానంలో హిందీ సినిమాలకు ప్రాధాన్యత ఎక్కువైందన్నారు. ఒకవేళ ఆయా రాష్ట్రాలు తమ సొంత భాషను రక్షించుకోవడంలో విఫలం అయితే.. ఆ స్థానాన్ని హిందీ ఆక్రమించే అవకాశాలు ఉన్నాయన్నారు.
మరోవైపు హిందీ భాషకు తమిళనాడు ఏ మాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన ఉదయనిధి స్టాలిన్.. తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మాత్రమే వ్యతిరేకమని తెలిపారు. బలవంతంగా భాషను రుద్దడానికి వ్యతిరేకంగానే ద్రవిడ ఉద్యమాలు పుట్టుకొచ్చాయన్నారు. జాతీయవాదం శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయడానికి ద్రవిడ నాయకులైన అన్నాదురై, కరుణానిధి లాంటి వారు తమిళ సాహిత్యాన్ని విస్తృతం చేశారని అందుకే వారు ప్రజల్లో మంచి గుర్తింపు పొందారని అన్నారు. 1930ల్లో, 1960ల్లో హిందీని అధికారిక భాషగా గుర్తించడానికి వ్యతిరేకంగా ద్రవిడ ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగాయన్నారు. ఇప్పటికీ హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దేందుకు కొందరు ‘జాతీయవాదులు’ ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీపై ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు.