Pavala Syamala: పాపం శ్యామల.. నీకే ఎందుకమ్మా ఇలా..? కష్టాల కడలిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్

ఆమె తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆమె మాట తీరు, నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఆమె చెయ్యని నాటకం లేదు నటించని పాత్ర లేదు. సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన ఆమె..ఇప్పుడు దినదిన గండంగా బతుకీడుస్తూ,కన్నీరుతో కడుపు నింపుకుంటూ..ఆపన్నహస్త కోసం ఎదురుచూస్తుంది.

Pavala Syamala: పాపం శ్యామల.. నీకే ఎందుకమ్మా ఇలా..? కష్టాల కడలిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్
Actress Pavala Shyamala
Follow us

|

Updated on: Nov 13, 2022 | 8:01 PM

పావలా శ్యామల…ఈ పేరు వినగానే తెలుగు సినీ అభిమానుల్లో నవ్వులు విరబూస్తాయి. నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆమె దాదాపు 350కి పైగా సినిమాలో నటించి ఎన్నో ఉత్తమ నటి పురస్కారాలు సాధించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్. బామ్మ క్యారెక్టర్ దగ్గర నుండి ఇంట్లో పనిమనిషి క్యారెక్టర్ వరకు ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి ఎందరినో నవ్విస్తూ ఆకట్టుకున్నారు. గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పావలా శ్యామల..తొలుత నాటకరంగంలో రాణించారు. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించి ,తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన పావలా శ్యామల పరిస్థితి ఇప్పుడు కరోనాకు ముందు…కరోనా తర్వాత అన్నట్లు ఉంది. మూడేళ్ల నుంచి ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయింది.

పావలా శ్యామల భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత…కూతురిని అల్లారుముద్దుగా చూస్తుండేవారు. కూతురు పెద్దయ్యాక, అమ్మకి తోడుగా షూటింగ్‌లకు వెళ్లేది. కానీ మూడేళ్ల క్రితం కూతురు కిందపడి ఒక కాలు విరిగిపోయింది. కాలికి ఐరన్‌ రాడ్లు వేశారు. ఈ పరిస్థితిలో ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. వయస్సు మీద పడటంతోపాటు కూతురు పరిస్థితిని చూసి కుంగిపోయింది. సడెన్‌గా గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరారు. హార్ట్‌కి హోల్స్‌ ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌కి డబ్బులు లేకపోవడంతో మందులతో కొన్నాళ్లు నెట్టుకొచ్చింది. ఆ తర్వాత ఆమె మంచానికే పరిమితమయ్యారు. కనీసం తినడానికి తిండి లేదు, చూసుకోవడానికి మనిషి కూడా లేడని వాపోయింది. ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు తల్లీకూతురు.

ఇంత దీనస్థితిలో ఉన్న పావలా శ్యామలపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. తనకి సహాయం చేయడానికి వచ్చిన వారిని ఎలాంటి సహాయం వద్దని ఆమె అన్నట్లు ప్రచారం జరిగింది. తాను అస్సలు అనలేదని ఆమె వాపోయారు. కరాటే కళ్యాణే తన గురించి తప్పుగా ప్రచారం చేసినట్లు చెప్పుకొచ్చారు. తన జీవితాన్ని చూసి భగవంతుడికే భయం వేస్తుందని చెప్పారు శ్యామల. కళాకారులకే కన్నీరు పెట్టించాడని వాపోయారు. ఒక్క చిరంజీవి మాత్రమే తనకు సాయం చేశారన్నారు పావలా శ్యామల. ‘మా’ కూడా ఎలాంటి సహాయం చేయలేదన్నారు. ఇప్పుడు అనాధాశ్రమంలో ఉంటున్న తనను, తన కూతురు చూసేవారే లేరంటూ కన్నీటి పర్యంతమయ్యారు శ్యామలమ్మ. పావలా శ్యామల ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. సాయం చేయకపోగా, తనపై ఆరోపణలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.