Tollywood Meeting: గత కొంత కాలంగా టాలీవుడ్లో సినిమా థియేటర్ రిలీజ్ జరిగిన తర్వాత ఓటీటీ విడుదల ఎప్పుడనే విషయంపై తీవ్ర సందిగ్ధత కొనసాగుతోంది. ఇటీవల థియేటర్లో విడుదలవుతున్న సినిమాలు వెంటనే ఓటీటీల్లోకి అడుగుపెడుతున్నాయి. చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేసిన నెలరోజుల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సినిమా నిర్మాతలు, ఓటీటీ యాజమాన్యాలు కూడా ఈ మేరకే ఒప్పందం చేసుకుంటున్నారు. అయితే దీని వల్ల థియేటర్ వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈక్రమంలో సినిమాల ఓటీటీ విడుదలపై బుధవారం (జూన్29) కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. థియేటర్లలో విడుదలైన చిత్రాలను ఎంత కాలానికి ఓటీటీల్లో రిలీజ్ చేయాలి? అన్నదానిపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా థియేట్రికల్ రిలీజ్‌కు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్‌కు మధ్య కనీసం 50 రోజుల గ్యాప్ తప్పనిసరి ఉండేలా ఈ మీటింగ్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసు మీడియాతో మాట్లాడారు. తన తాజా చిత్రం పక్కా కమర్షియల్ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆయన ఓటీటీ రిలీజులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేట్రికల్ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత డిజిటల్ వేదికగా సినిమా విడుదల చేసే అంశంపై టాలీవుడ్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా త్వరగా డిజిటల్ రిలీజ్ చేస్తే ఓటీటీ సంస్థలు ఎక్కువ డబ్బులు ఆఫర్ చేస్తున్నాయి అనే విషయాన్ని కొందరు నిర్మాతలు నిర్మాతల మండలి దృష్టికి తీసుకువచ్చారని ఈ నిర్మాత గుర్తు చేశారు. అది ప్రస్తుతానికి లాభదాయకంగానే ఉన్నా భవిష్యత్‌లో థియేటర్ వ్యవస్థ ఉనికికే అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే ఓటీటీ రిలీజులతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విధానం హీరోల మార్కెట్‌ను కూడా దెబ్బ తీస్తుందని బన్నీ వాసు అభిప్రాయపడ్డారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..