17 ఏళ్ల అమ్మాయి గర్భవతి అని చూపించా.. నాపై కేసులు వేశారు: దర్శకుడు తేజ
చిత్రం, నువ్వునేను, జయం, సంబరం, జై, ధైర్యం, ఔనన్నా కాదన్నా.. ఇలా ఎన్నో ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించారు డైరెక్టర్ తేజ. అంతేకాదు తన సినిమాల ద్వారా ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్, కాజల్ అగర్వాల్, ప్రిన్స్, నందిత వంటి స్టార్ హీరోలు, హీరోయిన్లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు తేజ, మహేష్ బాబుపై తాను చేసిన వ్యాఖ్యలు మీడియాలో వక్రీకరించారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా గురించి, అలాగే మహేష్ బాబు రెండు గ్రామాలను నిజంగా దత్తత తీసుకోవడం గురించి ఆసక్తికర కామెట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు తేజ మాట్లాడుతూ, మహేష్ బాబు గ్రామాన్ని దత్తత తీసుకోవడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.., నిజంగా ఫుల్ హార్టెడ్ గా చేసి ఉంటే గనక హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అని తాను చెప్పానని వివరించారు. అయితే, కొందరు మీడియా సంస్థలు “మామూలుగా ఎక్కువ మంది ఇటువంటివన్నీ చేసేది ఇన్కమ్ టాక్స్ కోసం చేస్తూ ఉంటారు” అన్న తన వ్యాఖ్యను మాత్రమే హైలైట్ చేసి చూపించారని ఆయన ఆరోపించారు. తాను చెప్పదలుచుకున్న అసలు విషయాన్ని పక్కన పెట్టి, వివాదాస్పద అంశాన్ని మాత్రమే ప్రచారం చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
అలాగే ఈ ఇంటర్వ్యూలో తేజ పలు ఇతర అంశాలపై కూడా తన అభిప్రాయాలను పంచుకున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడాకుల కేసులో మధ్యవర్తిత్వం వహించారన్న వార్తలను ఆయన ఖండించారు. రామ్ గోపాల్ వర్మ వన్ మ్యాన్ ఆర్మీ, వన్ మ్యాన్ ఇండస్ట్రీ అని, ఆయనకు ఎవరి సహాయం అవసరం లేదని తేజ అన్నారు. తన సినిమాల్లో లెక్చరర్ పాత్రలను నెగిటివ్ గా చూపించడంపై తరచూ ఎదురయ్యే విమర్శల గురించి తేజ స్పందించారు. నువ్వు నేను సినిమా నుంచి లెక్చరర్ల మీద జోకులు ఎక్కువయ్యాయని, సమాజంలో అందరు లెక్చరర్లు మంచివాళ్లే అని గ్యారెంటీ ఇవ్వలేమని అన్నారు. కొందరు తప్పు చేసేవారు ఉంటారని, వారిని తాను సినిమాల్లో చూపిస్తానని తేజ అన్నారు. కూతురితో అసభ్యంగా ప్రవర్తించే తండ్రులు కూడా సమాజంలో ఉంటారని, అలాంటి వాస్తవాలను సినిమాల్లో చూపించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
చిత్రం సినిమాను ఉదాహరణగా చూపుతూ, 16-17 ఏళ్ల అమ్మాయి గర్భవతి కావడంలాంటి వాస్తవాలను తెరపై చూపినప్పుడు కేసులు పెట్టారని, కానీ సమాజంలో ఇలాంటివి అనేకం జరుగుతున్నాయని తేజ అన్నారు. అలాగే సినిమా పరిశ్రమలో విశ్వాసం చాలా తక్కువని, కొందరు మంచి మనుషులకు మాత్రమే అది ఉంటుందని తేజ వ్యాఖ్యానించారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తాను బయట ఎలా ఉంటానో ఇంట్లో కూడా అలాగే ఉంటానని, పెద్దగా నటించాల్సిన అవసరం లేదని అన్నారు. పుస్తకాలు చదువుకుంటూ ఎక్కువ సమయం గడుపుతానని, తన భార్య పిల్లలు మాట్లాడితే తాను వింటానని తేజ తెలిపారు. తన కుమారుడు హోరా హోరి చిత్రాన్ని అవుట్ డేటెడ్ అని విమర్శించగా, నిజం సినిమా తనకు ఇష్టమని చెప్పినట్లు తేజ చెప్పుకొచ్చారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
