ఆస్తి ఇచ్చి కొడుకులను దద్దమ్మలుగా తయారు చేయడం తప్పు.. తేజ సెన్సేషనల్ కామెంట్స్
కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన తేజ ఆ తర్వాత డైరెక్టర్ గా మారారు. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఉదయ్ కిరణ్ తో చిత్రం, నువ్వునేను, నితిన్ తో జయం వంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీలను ఆడియెన్స్ కు అందించాడు తేజ. ఫ్యామిలీ సర్కస్, నిజం, జై, ధైర్యం, ఔనన్నా కదన్నా, ఒక విచిత్రం, లక్ష్మీ కల్యాణం, కేక, నీకు నాకు డ్యాష్ డ్యాష్, వేయి అబద్దాలు, హోరా హోరీ, సీత, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలను కూడా తెరకెక్కించాడు తేజ.

దర్శకుడు తేజ తన కెరీర్ ఆరంభం, ప్రత్యేకించి చిత్రం సినిమా నిర్మాణం, దాని వెనుక ఉన్న ఆర్థిక సవాళ్లు, అలాగే విజయం, సంపద, కుటుంబం గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. మూడు సినిమాలు చేసిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో చిత్రం మూవీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. తన పిల్లల పేర్లు పెట్టకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ, హిట్ అయితే అహం వస్తుందని, ఫ్లాప్ అయితే లక్కీ కాదని భావిస్తారని చెప్పారు. అందుకే తన మొదటి హిట్ సినిమా చిత్రం పేరును పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జయం సినిమా కోసం తన వద్ద ఉన్న డబ్బుతో పాటు సురేష్ బాబు గారి నుంచి ఒక కోటి రూపాయలు అప్పు తీసుకొని సినిమా తీశానని తేజ తెలిపారు. నితిన్, గోపీచంద్, సదా, సుమన్ శెట్టి వంటి 32 మంది కొత్తవారితో ఈ చిత్రాన్ని తెరకెక్కించానని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఈ నిర్ణయాన్ని ధైర్యంగా భావించినప్పటికీ, తనకు అది తెలియనితనం కావచ్చని తేజ అభిప్రాయపడ్డారు. మండుతున్న దీపంలో చిన్న పిల్లవాడు వేలు పెడితే తెలియనితనం అంటారని, అదే పెద్ద శరీరమున్న వాడు పెడితే ధైర్యం అంటారని, కానీ అతనికి చిన్న పిల్లవాడి మెదడు ఉంటే అది తెలియనితనమే అవుతుందని పోల్చారు. తాను తెలివికి పెట్టానని, అది చూసేవారికి ధైర్యంగా కనిపించిందని ఆయన వివరించారు.
విజయం అనే పదాన్ని సమాజం సాధారణంగా ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్‌లు, హిట్‌ల సంఖ్యతో కొలుస్తుందని, అయితే తన దృష్టిలో అది కాదని తేజ స్పష్టం చేశారు. “నాకు ఇప్పుడు రసగుల్లా తినాలని ఉంది. వెంటనే నేను తినగలిగితే అది సక్సెస్. నేను నిద్రపోవాలని ఉంది. ఈ ఇంటర్వ్యూ ఆపేసి, కాలు మీద కాలు వేసుకుని నిద్రపోయాను అనుకోండి, అది సక్సెస్. నాకు నచ్చినట్టుండి నేను చేయగలిగితే సక్సెస్” అని ఆయన తన విజయం నిర్వచనాన్ని పంచుకున్నారు. కుటుంబం పట్ల తన బాధ్యతలను వివరిస్తూ, భోజనం, నీడ, బట్టలు వంటి కనీస అవసరాలను అందించడమే ముఖ్యమని తేజ అన్నారు. కొడుకు కోసం ఆస్తులు కూడబెట్టడాన్ని ఆయన విమర్శించారు. “నా కొడుకు సన్నాసి, వాడు ఒక ఇడియట్, వాడు ఏమీ రూపాయి సంపాదించలేడు అనుకున్నోళ్లే బోల్డు పిల్లల కోసం ఆస్తి సంపాదించి పెట్టాలి” అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. తన కొడుకు మేధావి అని నమ్మకముంటే రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని, పిల్లలను మేధావులుగా తయారు చేయడమే తల్లిదండ్రుల లక్ష్యం కావాలని తేజ అభిప్రాయపడ్డారు.
ఆస్తి ఇచ్చి దద్దమ్మ కొడుకులాగా తయారు చేయడం తప్పు కదా అని ఆయన ప్రశ్నించారు. తేనెటీగలు తేనెను పోగుచేసినా, చివరికి మనుషులే తీసుకుంటారని, ఆస్తి దాచేవారి పరిస్థితి కూడా ఇదేనని ఆయన పోల్చారు. సంపాదించిన ఆస్తిని తరతరాలు నిలబెట్టుకున్న కుటుంబాలు ఎక్కడా ఉండవని, నాలుగో తరంకే నాశనం అవుతుందని, తిరిగి మొదటి నుండి ప్రారంభించాల్సి వస్తుందని తేజ స్పష్టం చేశారు. ఈ వాస్తవం తెలియకే ప్రజలు ఆస్తులు కూడబెడతారని ఆయన అన్నారు. తన చిత్రాలైన నిజం, జై, నేనే రాజు నేనే మంత్రి, సీత వంటివి తన తొలి ప్రేమకథా చిత్రాలైన చిత్రం, జయం, నువ్వు నేను వంటి వాటికి భిన్నంగా ఉంటాయని కూడా ఆయన పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
