
ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ రంభ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న రంభ తన తండ్రిని తల్చుకుంటూ బాగా ఎమోషనలైంది.. ‘ నాన్నా.. నా హృదయంలో నీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ నీ ముఖంపై చిరునవ్వు మాత్రం చెరిగిపోనివ్వలేదు. ఇప్పుడు నువ్వు వెళ్లిపోవడంతో నా ప్రపంచం శూన్యమైపోయింది’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది రంభ. ప్రస్తుతం ఆమె పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, సినీ అభిమానులు రంభ తండ్రి కి నివాళి అర్పిస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. కాగా రంభ మన తెలుగమ్మాయే. విజయ వాడలో పుట్టి పెరిగింది. ఆమె అసలు పేరు యూది విజయలక్ష్మి. తెలుగమ్మాయి అయినప్పటికీ రంభ తొలుత మలయాళంలో సినిమాలు చేసింది. 1992లో ‘సర్గామ్’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఇక రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రంభ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. తన అందం, అభినయానికి కూడా మంచి మార్కులు పడ్డాయి. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజకా, బావగారూ బాగున్నారా, అరుణాచలం, బొంబాయి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, మాతో పెట్టుకోకు, బంగారు కుటుంబం, గణేష్, హిట్లర్, ఇద్దరు మిత్రులు.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా చేసింది. దేశముదురు, హలో బ్రదర్, యమదొంగ వంటి సూపర్ హిట్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, భోజ్ పూరి, బెంగాలి భాషల్లోనూ రంభ సినిమాలు చేసింది.
కాగా సినిమా కెరీర్ స్పీడ్ గా ఉన్న సమయంలోనే పెళ్లిపీటలెక్కింది రంభ. 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ని పెళ్లిచేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. కాగా సినిమా ఇండస్ట్రీకి దూరమైనా బుల్లితెరపైనా కనిపిస్తోందీ అందాల తార. పలు టీవీ రియాలిటీ టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. సినిమాల్లోకి కూడా రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.