
నటుడు, దర్శకుడు, నిర్మాతగా రాణించిన చిన్నా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించారు. చాలా సినిమాల్లో సహాయకపాత్రల్లో నటించి అలరించారు చిన్నా.. సినిమాలతో పాటు పలు సీరియల్స్ లోనూ నటించారు చిన్నా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిన్నా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినీ పరిశ్రమలోకి వచ్చి 38 ఏళ్లు పూర్తి చేసుకున్నారు చిన్నా. ఈ సినీ జర్నీలో ఎదురైన ఎత్తుపల్లాల గురించి చిన్నా పంచుకున్నారు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ 38 ఏళ్లలో నేను ఖాళీగా ఉన్న రోజులు, అలాగే బిజీగా ఉండి చిన్న గ్యాప్ దొరికితే చాలు అనుకున్న రోజులు చూశాను అన్నారు. డబ్బు కోసం మాత్రమే పని చేయను. సినిమా పట్ల, నటన పట్ల నాకు అపారమైన అభిరుచి ఉంది అని అన్నారు.
గతంలో సినీ రంగ ప్రవేశం ఎంతో కష్టమైనదని, నేటి యువతకు ఈజీ అయిందని ఆయన అభిప్రాయపడ్డారు. తన తొలి హిందీ సినిమా శివలో తన నటనకు క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసించారని గుర్తు చేసుకున్నారు చిన్నా. టీవీ సీరియల్స్ లోనూ తనకు చాలా గౌరవం లభిస్తుందని చిన్నా తెలిపారు. టీవీకి, సినిమాకి పెద్ద తేడా లేదని, కానీ ఫిలిం, డిజిటల్ మధ్య మాత్రం చాలా మార్పులు వచ్చాయని అన్నారు చిన్నా.
రామగోపాల్ వర్మ తనకు తల్లిదండ్రులతో సమానమని అన్నారు చిన్నా, తల్లిదండ్రులు జితేందర్ రెడ్డికి జన్మనిస్తే, రామ్ గోపాల్ వర్మ చిన్నా అనే పేరుతో తనకు రెండో జన్మనిచ్చారని ఎమోష్నలయ్యారు. వర్మ ముందు ఇప్పటికీ తాను కూర్చోనని, ఆయన అంటే తనకు అపారమైన గౌరవం ఉందని అన్నారు. ఆర్జీవీ ఎప్పుడూ తాగి ఉంటారనే వార్తలు అబద్ధమని, ఆయన ముంబై వెళ్లిన తర్వాతే ఆ అలవాట్లు వచ్చాయని, అంతకు ముందు ఆయనకు పని తప్ప వేరే ఏమీ తెలియదని అన్నారు. ఆర్జీవీ ఇప్పుడు ఏ సినిమాలు చేసినా అది ఆయన ఇష్టమని, దానిపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని చిన్నా స్పష్టం చేశారు. చిన్నా అనే పేరు శివ సినిమా ద్వారానే వచ్చిందని, ఆర్జీవీ పెట్టిన ఈ పేరు తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది. మదనపల్లిలో షూటింగ్ కు వెళ్ళినప్పుడు ఒక దాబాలో చికెన్ కు చిన్నా అనే పేరు పెట్టడం, చిన్నా టీ స్టాల్స్ కనిపించడం వంటి సంఘటనలు తనకు ఆశ్చర్యం కలిగించాయని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని పరిశ్రమలోకి వచ్చానని, ఆయన పేరు చి అక్షరంతో మొదలవుతుంది కాబట్టి చిన్నా పేరు సెంటిమెంట్ గా బాగుంటుందని భావించానని అన్నారు. మొదట్లో శివ చిన్నా అని విజిటింగ్ కార్డులు చేయించినా, ఆర్జీవీ వాటిని చింపి కేవలం చిన్నా అని పెట్టుకోమని సలహా ఇచ్చారని తెలిపారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.