AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏవీఎస్ ఎలా చనిపోయారో తెలుసా.? తన తండ్రికోసం కూతురు త్యాగం.. అయినా కూడా ..

తెలుగు సినీ ప్రేక్షకులను తన హాస్యంతో దశాబ్దాల పాటు కడుపుబ్బా నవ్వించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం అలియాస్ ఏవీఎస్. జనవరి 2, 1957న ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో జన్మించారు ఆయన . కమెడియన్ గా, నిర్మాత, దర్శకుడు, రచయిత అలాగే జర్నలిస్టుగా పేరుపొందారు.

ఏవీఎస్ ఎలా చనిపోయారో తెలుసా.? తన తండ్రికోసం కూతురు త్యాగం.. అయినా కూడా ..
Avs
Rajeev Rayala
|

Updated on: Aug 04, 2026 | 7:30 AM

Share

తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం అలియాస్ ఏవీఎస్. కేవలం హాస్యనటుడిగానే కాకుండా నిర్మాత, దర్శకుడు, రచయిత, జర్నలిస్టుగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఏవీఎస్ సినీ రంగ ప్రవేశానికి ముందే రంగస్థల కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా మంచి పేరు సంపాదించారు. 1993లో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన “మిస్టర్ పెళ్ళాం” చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఈ తొలి చిత్రంతోనే తన నటనకు గాను నంది అవార్డును గెలుచుకుని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. మొత్తం నాలుగు నంది అవార్డులను అందుకున్నారు.

ఇది కూడా చదివేసేయండి : అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడు ఇలా

ఏవీఎస్ తన హాస్య సంభాషణలు, విభిన్నమైన హావభావాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. మాయలోడు, మావిడాకులు, శుభలగ్నం, ఘటోత్కచుడు, యమలీల, సమరసింహారెడ్డి, ఇంద్ర, యమగోల మళ్ళీ మొదలైంది వంటి దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. 90వ దశకంలో హాస్య నటులుగా అగ్రస్థానంలో ఉన్న బ్రహ్మానందం, అలీలకు ఆయన గట్టి పోటీనిచ్చారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా, ఏవీఎస్ రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా, పాటల రచయితగా కూడా తన సత్తా చాటారు. సూపర్ హీరోస్ వంటి చిత్రంలో హీరోగా నటించి మెప్పించారు.  తెలుగు సినిమా ఆడియన్స్‌ను కొన్ని దశాబ్దాల పాటు కడుపుబ్బా నవ్వించిన ఏవీఎస్, తన 57వ ఏట 2013 నవంబర్ 28న అకాల మరణం చెందారు. ఆయన మరణం యావత్ తెలుగు సినీ లోకాన్ని, ప్రేక్షకులను తీవ్రంగా కలచివేసింది.

ఇది కూడా చదివేసేయండి : సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్న హీరో.. కటౌట్లు తగలబెట్టి , థియేటర్లపై దాడి చేసిన అభిమానులు

గతంలో ఏవీఎస్ కుమార్తె శాంతి శ్రీనివాస్ తన తండ్రి మరణం వెనుక ఉన్న కొన్ని తెలియని విషయాలను పంచుకున్నారు. తన తండ్రి నిరంతరం షూటింగులలో పాల్గొనడం, సరైన నిద్ర లేకపోవడం వల్లే ఆరోగ్యం దెబ్బతిని మరణించారని వెల్లడించారు. కొందరు తన తండ్రి మద్యపానం వల్లే ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని అపార్థం చేసుకున్నారని ఆమె వాపోయారు. 2008లో తన తండ్రి కాలేయం పాడై, రక్తపు వాంతులు చేసుకున్నారని, ఆ సమయంలో డాక్టర్లు కాలేయ మార్పిడిని సూచించారని శాంతి తెలిపారు. తాను కాలేయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, తన శరీర బరువు ఎక్కువ కావడంతో అది సాధ్యం కాలేదని చెప్పారు. అప్పటికే ఏవీఎస్ ఆరోగ్యం దిగజారి, జ్ఞాపకశక్తి కోల్పోయారని, ఎవరినీ గుర్తుపట్టలేకపోయారని వివరించారు. అయితే ఒక అనూహ్య ఘటనలో, ఐసీయూలో ఉన్న ఏవీఎస్ మరుసటి రోజు ఉదయం తమకు కాల్ చేశారని, ఆయనకు జ్ఞాపకశక్తి ఎలా తిరిగి వచ్చిందో అర్థం కాలేదని శాంతి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 20 రోజుల్లో కాలేయ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పడంతో, శాంతి మరోసారి తన కాలేయం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే, భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తాయనే కారణంతో ఏవీఎస్ మొదట అంగీకరించలేదు. కానీ తన భర్త ఒప్పించడంతో, శాంతి తన కాలేయంలో 60 శాతం దానం చేశారు. ఆపరేషన్ తర్వాత ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినప్పటికీ, ఏవీఎస్ ఆ మాట వినకుండా తిరిగి షూటింగులకు వెళ్లారని శాంతి చెప్పారు. ఆపరేషన్ జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత, ఆయన పరిస్థితి విషమించి, శాంతి చేతిలోనే రక్తం కక్కుకుని నవంబర్ 28, 2013న తుది శ్వాస విడిచారు.

ఇది కూడా చదివేసేయండి : ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్‌లో దగ్గరుండి మరీ చూసేవారట

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us