Vishal: హీరో విశాల్‌ను టార్గెట్‌ చేసిన ప్రొడ్యూసర్స్.. రీజన్ అదేగా

|

Jul 26, 2024 | 9:45 PM

సినిమాలో హీరో విలన్‌ని టార్గెట్‌ చేసినట్లు... ప్రొడ్యూసర్లు ఓ హీరోను టార్గెట్‌ చేశారు. ఎంతలా అంటే... ఆయన సినిమాకి పనిచేయాలంటే టెక్నీషియన్‌ దగ్గర్నుంచి, ఆర్టిస్టుల వరకు ప్రతిఒక్కరూ పర్మిషన్‌ తీసుకోవాల్సిందే. ఇంతకు నిర్మాతలకు టార్గెట్‌గా మారిన ఆ హీరో ఎవరు...? ప్రొడ్యూసర్ల పాలిట విలన్‌ ఎందుకయ్యాడు...?

Vishal: హీరో విశాల్‌ను టార్గెట్‌ చేసిన ప్రొడ్యూసర్స్..  రీజన్ అదేగా
Vishal
Follow us on

హిట్స్‌ అండ్‌ ఫ్లాప్స్‌తో సంబంధం లేదు. కలెక్షన్ల లెక్కలు అసలే అవసరం లేదు. సినిమా తీశామా…! రిలీజ్‌ చేశామా…! మళ్లీ సినిమా తీశామా…! రిలీజ్‌ చేశామా…! ఇదే ఫార్మాట్‌ ఫాలో అవుతాడు తమిళ హీరో విశాల్. మినిమం రేంజ్‌ హీరోగా కోలీవుడ్‌లో మాంచి ఫేమ్‌ సాధించాడు. డైరెక్టర్‌ ఏది చెప్తే అది చేస్తాడు… ప్రొడ్యూసర్‌కు అండగా ఉంటాడు అన్న టాక్‌ కూడా ఉంది. అలాంటి విశాల్‌ను ఇప్పుడే అదే నిర్మాతలు టార్గెట్‌ చేశారు. టార్గెట్‌ అంటే మామూలుగా కాదు.. అంతకుమించి.

విశాల్‌ సినిమాకి పనిచేయాలంటే… టెక్నీషియన్‌ దగ్గర్నుంచి ఆర్టిస్టుల వరకు ప్రతిఒక్కరూ పర్మిషన్‌ తీసుకోవాల్సిందే. పర్మిషన్‌ తీసుకోకుంటే… ఇక వాళ్ల పని అయిపోయినట్లే. ఇండస్ట్రీ నుంచి అవుట్‌ అవుతారంటూ ఓ పెద్ద లెటర్‌ను తమిళ నిర్మాతల మండలి రిలీజ్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

2017 నుంచి 2019 వరకు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పనిచేసిన విశాల్… పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తున్నారు తమిళ ప్రొడ్యూసర్లు. కోటి కాదు రెండు కోట్లు కాదు…. ఏకంగా 12 కోట్ల రూపాయలను విశాల్‌ దారి మళ్లించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్‌… నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నిధుల దుర్వినియోగం జరిగిందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తమిళ నిర్మాతలంతా కలిసి… విశాల్‌ సినిమాలో ఎవరు పనిచేయాలన్నా పర్మిషన్‌ కంపల్సరీ అన్న రూల్‌ను తీసుకొచ్చారు.

ఇటీవల అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశాడు హీరో విశాల్. సిని ఇండస్ట్రీపై ప్రభుత్వం పెత్తనం నడుస్తోందంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. సినిమా విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఏంటని ప్రశ్నించారు…? రాజకీయ నాయకులు నటులుగా మారిపోవడం వల్ల.. నటులు రాజకీయ నేతలుగా మారుతున్నానంటూ… సీఎం స్టాలిన్‌ కుమారుడు హృదయ నిధి స్టాలిన్‌ను ఉద్దేశిస్తూ కాస్త ఘాటుగా మాట్లాడారు. దీంతో విశాల్‌ను కావాలనే టార్గెట్‌ చేస్తున్నారంటూ కోలీవుడ్‌లో పెద్ద చర్చ నడుస్తోంది. డీఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఇలా జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నారు.

తమిళ నిర్మాతల మండలి నిర్ణయంపై సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా రియాక్ట్‌ అయ్యాడు విశాల్‌. ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. ఎవరెన్ని చేసినా… తగ్గేదేలే అంటున్నారు. తన మీద ఎన్ని ఆరోపణలు చేసినా… దాడులకు దిగినా సినిమాలు తీస్తూనే ఉంటానన్నారు విశాల్.

మొత్తంగా… విశాల్‌ సినిమాలపై ఆంక్షలు పెట్టడం తమిళనాట చర్చనీయాంశమైంది. నిర్మాతల మండలిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు విశాల్‌ ఫ్యాన్స్‌. మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి… !

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.