కరోనా మహమ్మారి మానవులపై పగబట్టింది. సామాన్యులతో పాటు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు ఈ వైరస్ బారినపడి ప్రాణాలు విడిచారు. అందులో చిత్ర పరిశ్రమకు చెందినవారు కూడా ఉన్నారు. తెలుగు పరిశ్రమకు కూడా కరోనా చాలా డ్యామేజ్ చేసింది. తాజాగా దర్శకుడు అక్కినేని వినయ్ కుమార్ కరోనాతో మృతి చెందారు. ఈయన వయసు 65 సంవత్సరాలు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ‘ఏడంస్తుల మేడ’ నుంచి దాసరి వద్ద శిష్యరికం చేసిన వినయ్ కుమార్ ‘పవిత్ర’ సినిమాకు దర్శకత్వం వహించారు. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ‘సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడా’ సినిమాకు నిర్మాణ నిర్వహణ బాధ్యతలు కూడా నిర్వహించారు. సూపర్ హిట్ టీవీ సీరియల్ ‘అంతరంగాలు’, నా మొగుడు నాకే సొంతం, అమ్మ, ఆరాధన వంటి పలు సీరియల్స్ కి దర్శకత్వం వహించారు వినయ్ కుమార్. ఆయన మరణం పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాగా కేవలం నటులు, దర్శకులు, నిర్మాతలు మాత్రమే కాదు. వివిధ క్రాఫ్టులకు చెందిన పలువురు ప్రముఖులను కరోనా బలితీసుకుంది. తాజాగా నటుడు, సినీ జర్నలిస్ట్ టీ.ఎన్.ఆర్ కూడా కరోనాతో ఈ లోకాన్ని వీడారు. మరోవైపు సెకండ్ వేవ్ వీరవిహారం చేస్తుండటంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులు, సినీ కార్మికులు విపరీతమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు.
Also Read: ఏడాదిలో ఎప్పుడైనా తిరుమల వెంకన్న దర్శనం.. ఆ టికెట్ ఉన్నవారికి మాత్రమే..!