Tollywood : ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ..

| Edited By: Rajeev Rayala

Dec 26, 2024 | 7:28 AM

గురువారం ఉద‌యం 10 గంట‌ల‌కు టాలీవుడ్ ప్ర‌ముఖులు ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు ఆధ్వ‌ర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో స‌మావేశం కానున్నారు. టాలీవుడ్ డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు అంద‌రం క‌లిసి రేపు ముఖ్య‌మంత్రిని క‌లుస్తామ‌ని దిల్ రాజు వెల్ల‌డించారు. సీఎంతో భేటీపై హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు దిల్ రాజు స‌మాచారం ఇస్తున్నారు.

Tollywood : ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ..
Cm.revanth Reddy
Follow us on

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఈరోజు ఉదయం 9.45 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సినీ పరిశ్రమ ప్రముఖులతో ప్రత్యేక సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి నిర్మాత దిల్ రాజు, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, అల్లు అరవింద్‌తో పాటు పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నారు. ప్రభుత్వ తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ పాల్గొనబోతున్నారు.

ఈ సమావేశంలో ప్రధానంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చర్చించనున్నారు. ఈ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ కుటుంబానికి ఇప్పటికే రూ.2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించగా, అల్లు అర్జున్ రూ.1 కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, పుష్ప నిర్మాతలు మరో రూ.50 లక్షలు ఇచ్చారు

సంధ్యా థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ దురదృష్టవశాత్తు మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బుధవారం నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ అతడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, ప్రస్తుతం వెంటిలేటర్ అవసరం లేకుండా ఉన్నారని దిల్ రాజు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి నటుడు అల్లు అర్జున్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. ఈ భేటీలో టికెట్ ధరల నియంత్రణ, థియేటర్ల నిర్వహణ, జీఎస్టీ తగ్గింపు, మరియు సినిమా పరిశ్రమతో సంబంధమున్న ఇతర సమస్యలపై చర్చ జరగనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.