AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది అప్పట్లో బాహుబలి రేంజ్ మూవీ.. కేవలం 53 రోజుల్లోనే తీశారు.. బడ్జెట్ ఎంతంటే..?

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ సాహసోపేత ప్రయత్నం సింహాసనం. 70ఎంఎం, తెలుగు-హిందీ భాషల్లో ఏకకాలంలో కేవలం 53 రోజుల్లో నిర్మించబడిన ఈ చిత్రం ఆయన దార్శనికతకు, సమర్థతకు నిదర్శనం. ఆధునిక సినిమాలతో పోలిస్తే అద్భుతమైన నిర్మాణ విలువలు, భారీ వసూళ్లతో చరిత్ర సృష్టించిన సింహాసనం తెలుగు సినిమా మైలురాయిగా నిలిచింది.

ఇది అప్పట్లో బాహుబలి రేంజ్ మూవీ.. కేవలం 53 రోజుల్లోనే తీశారు.. బడ్జెట్ ఎంతంటే..?
Simhasanam Movie
Ram Naramaneni
|

Updated on: Jul 25, 2026 | 8:04 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో సాహసాలకు, వినూత్న ప్రయత్నాలకు మారుపేరు సూపర్ స్టార్ కృష్ణ. తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్ళకు మోసగాడు, రంగుల్లో తొలి సినిమాస్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు వంటి ప్రయోగాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, సింహాసనం చిత్రంతో మరో అసాధారణమైన ఘనతను సాధించారు. ఇది తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించబడిన తొలి 70 ఎం.ఎం. చిత్రం. ఈరోజుల్లో బాహుబలి వంటి పాన్ ఇండియన్ చిత్రాలను తీయడానికి దర్శకులకు ఐదేళ్లు, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలకు ఏళ్లు పడుతున్న తరుణంలో, సూపర్ స్టార్ కృష్ణ కేవలం 53 రోజుల్లో సింహాసనం చిత్రాన్ని పూర్తి చేయడం ఆయన కార్యదక్షతకు, పక్కా ప్రణాళికకు అద్దం పడుతుంది. అగ్ర హీరోగా నిరంతరం సినిమాలు చేస్తూనే, రెండు విభిన్న పాత్రలు పోషించి, ఎడిటింగ్, దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించి ఈ అద్భుతాన్ని సాధించారు. అప్పట్లో 40, 50 లక్షల్లో సినిమాలు తీస్తున్న రోజుల్లో, రూ. 3 కోట్ల 20 లక్షల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించడం కృష్ణ దార్శనికతను చాటింది. నేటి దర్శకులను ఈ స్థాయి చిత్రాన్ని తీయమంటే రూ. 200 కోట్లు, ఐదేళ్లు కావాల్సి వస్తుందని విమర్శకులు అభిప్రాయపడతారు.

1977లో వచ్చిన పాడిపంటలు చిత్రం తర్వాత ఒక జానపద చిత్రాన్ని చేయాలనే ఆలోచన కృష్ణకు కలిగింది. అయితే, సాంఘిక చిత్రాలు మాత్రమే ఆడుతున్న ఆ రోజుల్లో శ్రేయోభిలాషుల సూచనతో ఆయన కొంతకాలం వెనుకంజ వేశారు. పద్మాలయ బ్యానర్‌పై సినిమాలు చేస్తూనే, హిందీ చిత్ర పరిశ్రమలోనూ విజయయాత్ర సాగిస్తున్న తరుణంలో, జానపద కథను తెలుగుతో పాటు హిందీలోనూ నిర్మించాలనే ఆలోచన మళ్లీ బలపడింది. అప్పటికే పద్మాలయ స్టూడియోస్ సిద్ధం కావడంతో, ఒక ట్రయల్ బేస్‌గా హిందీలో పాతాళభైరవిని నిర్మించారు. జితేంద్ర, జయప్రద జంటగా నటించిన ఆ చిత్రానికి ఉత్తరాది ప్రేక్షకుల నుంచి బ్రహ్మరథం పట్టడంతో ధైర్యం వచ్చి సింహాసనం చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి రచన బాధ్యతను మహారధికి అప్పగించారు కృష్ణ. కొన్ని జానపద సంఘటనల ఆధారంగా కథను రూపొందించారు మహారధి. విక్రమ సింహుడు, ఆదిత్యవర్ధనుడు అనే రెండు పాత్రలను తెలుగులో కృష్ణ పోషించగా, హిందీలో జితేంద్ర నటించారు. అలకనందాదేవిగా జయప్రద, రాజనర్తకి జస్వంతిగా రాధా, విషకన్య చందనగంధిగా మందాకిని నటించారు. రాజ్ కపూర్ చిత్రం రామ్ తేరీ గంగా మైలీతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మందాకిని తెలుగులో నటించిన తొలి చిత్రం ఇదే. అలాగే అంజాద్ ఖాన్ నటించిన తొలి తెలుగు సినిమా కూడా ఇదే. కృష్ణ తల్లిగా రాజమాత పాత్రను వహీదా రెహమాన్ పోషించారు. ఆమెకు షావుకారు జానకి డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రానికి కళా దర్శకుడు భాస్కరరాజు సారథ్యంలో మూడున్నర ఎకరాల స్థలంలో దాదాపు రూ. 45 లక్షల వ్యయంతో భారీ సెట్స్ నిర్మించారు. 400 మంది కార్మికులు 45 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి తెలుగులో పనిచేసిన తొలి చిత్రం సింహాసనం. ఈ సినిమాకు ఆయన అందించిన సంగీతం భారీ విజయాన్ని అందించింది. గాయకుడు రాజ్-సీతారాం పాడిన ఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈ వేళ పాట బాగా ప్రజాదరణ పొందింది.

హీరో కృష్ణ 235వ చిత్రంగా సింహాసనం 1986 మార్చి 21న విడుదలైంది. 86 ప్రింట్‌లతో విడుదలైన తొలి చిత్రంగా ఇది కొత్త రికార్డు నెలకొల్పింది. అలాగే, హిందీ వెర్షన్ సింఘాసన్ 125 ప్రింట్‌లతో విడుదలైంది. ఆరు కేంద్రాలలో 70 ఎంఎం ప్రింట్లు విడుదల చేశారు. సింహాసనం తొలి వారం రూ. 1 కోటి 51 లక్షల 65 వేల 291 రూపాయలు వసూలు చేసి ఆల్ టైం స్టేట్ రికార్డ్ సాధించింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ దేవి థియేటర్‌లో రోజుకి నాలుగు ఆటలతో 105 రోజులు ఆడింది. వైజాగ్ లోని చిత్రాలయలో 100 రోజుల పాటు ప్రదర్శించబడింది. ఈ చిత్ర శతదినోత్సవ వేడుకలు 1986 జూలై 12న చెన్నైలోని వీజీపీ గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు అధ్యక్షత వహించగా, రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సింహాసనం తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన నిర్మాణంగా, సూపర్ స్టార్ కృష్ణ దార్శనికతకు నిదర్శనంగా నిలిచింది.

Follow Us