AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. టైగర్ ముత్తువేల్ పాండియన్ మరోసారి మెప్పించారా..?

మూడేళ్ళ కింద జైలర్ సినిమాతో ఇండియన్ సినిమాను షేక్ చేసారు రజినీకాంత్ అండ్ నెల్సన్. మళ్లీ ఇప్పుడు సీక్వెల్‌తో వచ్చారు. మరి ఈసారి కూడా సేమ్ మ్యాజిక్ రిపీట్ అయిందా..? ఫస్ట్ పార్ట్ చేసిన మ్యాజిక్ సెకండ్ పార్ట్‌లోనూ వర్కవుట్ అయిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. టైగర్ ముత్తువేల్ పాండియన్ మరోసారి మెప్పించారా..?
Jailer 2 Movie
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 15, 2026 | 12:20 PM

Share

మూవీ రివ్యూ: జైలర్ 2

నటీనటులు: రజినీకాంత్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, విద్యాబాలన్, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు, మిథున్ చక్రవర్తి, యోగిబాబు, మీర్నా మీనన్ తదితరులు

సినిమాటోగ్రఫర్: వినయ్ కార్తిక్ ఖన్నన్

సంగీతం: అనిరుధ్

ఎడిటర్: ఆర్ నిర్మల్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: నెల్సన్ దిలీప్ కుమార్

నిర్మాత: కళానిధి మారన్

కథ:

కొడుకును చంపిన తర్వాత తన ఓ సూపర్ మార్కెట్‌లో పని చేసుకుంటూ ఉంటారు ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్). మరోవైపు ఫస్ట్ పార్ట్‌లో వర్మ (వినాయకన్)ను ఎవరు చంపారో తెలుసుకోడానికి అతని వెనుక ఉన్న బడా స్మగ్లింగ్ మాఫియా ముఠాలు అసలు హంతకుడిని వెతికే పనిలో పడతాయి. తన పని తాను చేసుకుంటున్నా కూడా ముత్తువేల్ లైఫ్‌లోకి దిలీప్ (సూరజ్ వంజరమూడు) వస్తాడు. దాంతో మళ్ళీ ఈ గ్యాంగ్ వార్‌లోకి లాగబడతాడు ముత్తువేల్. అక్కడ్నుంచి కథ కల్పక్ కుటుంబం దగ్గర ఆగుతుంది. గోవాలో నేర సామ్రాజ్య వారసులు అయిన బోధి కల్పక్ (ఎస్‌జే సూర్య), కాంతా కల్పక్ (విద్యాబాలన్) కూడా జైలర్‌నే టార్గెట్ చేస్తారు. అసలు ఈ భారీ సిండికేట్‌ నుంచి తన ఫ్యామిలీని జైలర్ ఎలా తప్పించాడు..? వాళ్ల ఆట కట్టించడానికి ముత్తువేల్ పాండియన్ ఎలాంటి వ్యూహాలు రచించాడు అనేదే ‘జైలర్ 2’ అసలు స్టోరీ.

కథనం:

మొదటి పార్ట్‌తోనే ఆడియన్స్ పల్స్ పట్టేసిన డైరెక్టర్ నెల్సన్, ఈ సీక్వెల్‌లో తనకు బాగా అలవాటైన పిచ్ మీద అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. హీరో క్యారెక్టరైజేషన్, అతని పవర్ ఏంటో ముందే అందరికీ తెలుసు కాబట్టి, లాజిక్స్ గురించి ఆలోచించకుండా పక్కా మాస్ ఎలివేషన్స్‌తో కథనాన్ని పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ స్క్రీన్‌ప్లే అయితే నెక్స్ట్ లెవెల్‌లో కుదిరింది. నెల్సన్ తన మార్క్ డార్క్ కామెడీతో నవ్విస్తూనే, ప్రతీ పది నిమిషాలకు ఒక అదిరిపోయే హై మూమెంట్ ఇస్తూ థియేటర్లలో విజిల్స్ పడేలా చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా గూస్‌బంప్స్ తెప్పించేలా సెట్ అయింది. అయితే ఫస్ట్ పార్ట్‌లోనే గెస్ట్ రోల్స్ తాలూకు సర్‌ప్రైజ్‌లు చూసేశాం కాబట్టి, ఇందులో స్టార్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ కొత్తదనం కనిపించకపోయినా, వాళ్లు స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం పక్కా. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే, ఎమోషనల్ డ్రామా పెరగడంతో మొదటి 20 నిమిషాలు సినిమా కాస్త నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ వెంటనే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో గ్రాఫ్‌ను మళ్ళీ పైకి లేపాడు దర్శకుడు. కాకపోతే అసలు కథ చాలా చిన్నది కావడం, సినిమా మొత్తం మొదటి భాగం టెంప్లేట్‌లోనే సాగడంతో కొత్త విలన్లు వచ్చినా పెద్దగా ఫ్రెష్‌నెస్ కనిపించదు. పైగా ఎస్‌జే సూర్యతో వచ్చే సీన్స్ కూడా ల్యాగ్ అనిపిస్తుంటాయి. దాదాపు 3 గంటల నిడివి ఉండటం వల్ల సెకండాఫ్‌లో మెయిన్ సీన్స్ మధ్య గ్యాప్ ఎక్కువై సాగదీసినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ బాగున్నప్పటికీ, దాన్ని ఇంకాస్త పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసుంటే ఇంపాక్ట్ మరోలా ఉండేది. మొత్తానికి పార్ట్ 3 కూడా ఉండబోతోందనే హింట్ ఇస్తూ ఈ ఫ్రాంచైజీని ముగించిన తీరు ఆకట్టుకుంటుంది.

నటీనటులు:

సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన వింటేజ్ స్వాగ్‌తో వన్ మ్యాన్ షో చేశారు. ఆయన కొత్తగా కష్టపడకపోయినా, జస్ట్ అలా స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చి కళ్లజోడు తీసి పెట్టుకుంటే చాలు.. స్క్రీన్ మొత్తం ఊగిపోయేలా తన సిగ్నేచర్ మ్యాజిక్ చూపించారు. ఇక ఫస్టాఫ్‌లో డాన్ మూర్తి పాత్రలో నమో నారాయణ చేసే కామెడీ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలిచింది. పరిస్థితులు తన చేయి దాటిపోయినా సరే, అన్నీ తానే కంట్రోల్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చే అతని క్యారెక్టర్, రజనీతో కలిసి చేసే సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే సెకండాఫ్‌లో ఇతని పాత్ర తగ్గడం సినిమా స్పీడ్‌పై కాస్త ఎఫెక్ట్ చూపించింది. యోగిబాబు తన పరిధి మేరకు నవ్వించాడు. మెయిన్ విలన్‌గా ఎస్.జె. సూర్య తనకు అలవాటైన రీతిలో బాగానే పెర్ఫార్మ్ చేసినా ఆ క్యారెక్టర్‌లో కొత్తదనం లేదు. కానీ అతని సోదరిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విద్యాబాలన్ నటన చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. సూరజ్ వెంజరమూడు కూడా విలన్‌గా తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక క్యామియోల విషయానికి వస్తే.. మోహన్‌లాల్ కేవలం రెండు సీన్స్‌లో, శివరాజ్ కుమార్ ఓ పది నిమిషాల పాటు మాత్రమే కనిపిస్తారు. జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి పాత్రలకు ఈసారి పెద్దగా స్కోప్ దక్కలేదు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు రజనీకాంత్ తర్వాత అంతటి బలాన్ని ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. రజనీ సైలెంట్‌గా నడిచొచ్చే సాధారణ సీన్స్‌ను కూడా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకాశానికి ఎత్తేశాడు. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్‌లో పాత జైలర్ థీమ్ మ్యూజిక్‌ను మళ్ళీ వాడుతూ మూడ్ సెట్ చేసిన తీరు థియేటర్లలో దుమ్మురేపింది. దర్శకుడు నెల్సన్ బలమైన కథ కంటే కేవలం రజనీ హీరోయిజం, తన డెడ్‌పాన్ కామెడీ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. రైటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉండి, సెకండాఫ్ పేసింగ్‌పై దృష్టి పెట్టుంటే రిజల్ట్ మరో రేంజ్‌లో ఉండేది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ చాలా గ్రాండ్‌గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి. అయితే ఎడిటర్ ఆర్. నిర్మల్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి, మూడు గంటల రన్‌టైమ్‌ను తగ్గించి ఉంటే సినిమా మరింత ఎంగేజింగ్‌గా ఉండేది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా జైలర్ 2.. టైగర్ కా హుకుం.. పర్ఫెక్ట్ సీక్వెల్..

Follow Us