Sudheer 14 Movie: సుధీర్ బాబు హీరోగా.. ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మోహనం’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా యూత్‌ను తెగ ఆట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వి’ సినిమా తెరకెక్కింది. నాని హీరోగా వచ్చిన ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్రను కూడా దర్శకుడు బాగా చూపించాడు.
ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. సుధీర్ బాబు 14వ సినిమా రూపొందుతోన్న ఈ చిత్రానికి మేహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గతకొన్ని రోజులగా ఈ సినిమాపై వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దీంతో తాజాగా ఈ విషయమై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు హీరో సుధీర్ బాబు. ఓ వీడియోను పోస్ట్ చేసి తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ఇంతకీ సుధీర్ బాబు ఈ వీడియో ఏం చెప్పాడంటే.. ‘ప్రేమ కథలు నచ్చని మనుషులు ఉండరేమో కదా.. దీనికి కారణం ప్రేమలేని జీవితం ఉండకపోవడమే కావొచ్చు. అయితే నాలాంటి అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి గురించి ఎవరికైన చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు ఎలా మొదలు పెట్టారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చాలా మంది నేను మొదలు పెట్టినట్టే మొదలు పెట్టి ఉంటారు’ అంటూ మాట్లాడిన సుధీర్ బాబు. తాను మొదలు పెట్టింది ఏంటో తెలుసుకోవాలనుకుంటే మార్చి 1 వరకు వేచి చూడండి అంటూ తన కొత్త సినిమాను వినూత్నంగా ప్రకటించాడు. ఆసక్తికరమైన ప్రేమ కథగా తెరెక్కుతోన్న ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించనున్నాడు.