Ram Gopal Varma: సంచలనాలకు మారు పేరు రామ్ గోపాల్ వర్మ. ఎలాంటి వివాదం లేకపోతే తానే ఓ వివాదాన్ని రాజేసి ఆ వివాదంతో ఉచితంగా ప్రచారాన్ని పొందుతుంటారు. ఇలా ఎప్పటికప్పుడు సంచలనాలకు మారుపేరుగా నిలిచే వర్మ ఇప్పుడు మరో సంచలనానికి తెర తీశారు. వరంగల్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు కొండా మురళీ, సురేఖల జీవిత కథను బయోపిక్‌గా తెరకెక్కించేందుకు ముహుర్తం సిద్ధం చేసుకున్నారు. ‘కొండా’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను వర్మ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ క్రమంలోనే మంగళవారం కొండా దంపతులతో కలిసి భారీ ర్యాలీని నిర్వహించారు.
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. ‘నన్ను కొందరు మురళీ అన్నను మంచి వాడిగా చూపిస్తావా.? చెడ్డ వాడిగా చూపిస్తావా.? అని అడిగారు. కానీ నేను మురళీ అన్నను మురళీ అన్నలా చూపిస్తాను’ అని చెప్పుకొచ్చారు. దీంతో సినిమాపై ఒక్కసారిగా ఆసక్తిని పెంచేశారు. ఈ క్రమంలోనే మురళీ, సురేఖల నేపథ్యంలో ఓ పాటను వర్మ వినిపించారు. ఈ పాట వినగానే సురేఖ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం కోసం వరంగల్ చేరకున్న వర్మ వరంగల్, వంచనగిరి గ్రామంలోని గండి మైసమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ఆచారాలకు అనుగుణంగా వర్మ అమ్మవారికి మద్యాన్ని అందించారు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి వర్మ.. ‘నేను వోడ్కా తాగినప్పటికీ.. మైసమ్మకు విస్కీని అందించాను’ అని తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. అనంతరం వంచనగిరి గ్రామంలో సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. 1980లో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సనిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో మురళీ పాత్రలో అరుణ్ అదిత్, సురేఖ పాత్రలో ఇర్రా నటించనున్నారు. ఇక అసలు దేవుడిని నమ్మను అని చెప్పుకునే వర్మ ఇలా.. గుడిలో పూజలు నిర్వహించేసరికి ఈ విషయం కాస్త టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారింది.
Entering Maisamma temple in Warangal pic.twitter.com/DghG8euWvO
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2021