
సీనియర్ హీరోయిన్ రాశి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. బాలనటిగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత కథానాయికగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పవన్ కళ్యాణ్ సరసన గోకులంలో సీత, జగపతి బాబు జోడిగా శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, స్నేహితులు, ప్రేయసి రావే వంటి హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించిన రాశి.. ఇటు ట్రెడిషనల్.. అటు గ్లామరస్ పాత్రలలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తూ మెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాశి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాశీ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అనేక భాషల్లో, పెద్ద పెద్ద హీరోలతో నటించినప్పటికీ, తనకు ఎప్పుడూ ఎలాంటి అసౌకర్యం ఎదురు కాలేదని ఆమె అన్నారు. కంఫర్ట్ అనేది మన ఏర్పరచుకోవడంలో ఉంటుంది. డిస్కంఫర్ట్ అనిపిస్తే వెంటనే చెప్పగలగాలి.. నాకు ఎటువంటి అసౌకర్యాలు ఎదురుకాలేదు. ప్రపోజల్స్ ఉన్నాయి కానీ డిస్కంఫర్ట్స్ లేవు అని రాశి అన్నారు. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో వయసు, కెరీర్, హోదా వంటి కారణాల వల్ల ఒక గౌరవపూర్వక దూరాన్ని పాటించేవారమని, వారిని సర్‌లని పిలిచేదని రాశి అన్నారు. అయితే, శ్రీకాంత్, జె.డి., రవి, నవీన్ వంటి నటులతో మరింత సన్నిహితంగా, స్వేచ్ఛగా మెలిగేవారమని గుర్తుచేసుకున్నారు. మేమంతా కోతి బ్యాచ్ లా ఉండేవాళ్లం అని సరదాగా అన్నారు రాశి.
మొబైల్ ఫోన్లు లేకపోవడం వల్ల ఆ రోజుల్లో సెట్లలో చాలా బాగుండేది అని రాశి అన్నారు. ఫోన్లు లేకపోవడం వల్ల షూటింగ్ విరామ సమయాల్లో నటీనటులు, టెక్నీషన్స్ తో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయడం వంటివి ఎక్కువగా జరిగేవని, ఇది కుటుంబ వాతావరణాన్ని తలపించేదని రాశీ అన్నారు. శ్రీదేవి, జయప్రద వంటి కొందరు నవలలు చదివితే, తాను చిన్న వయస్సు కావడంతో గేమ్స్ ఆడటానికి ఇష్టపడేదానిని అన్నారు. తమ తల్లి స్వయంగా వంట చేసి పెట్టేవారని, ముఖ్యంగా భీమవరం వంటకాలు షూటింగ్ లొకేషన్ కు వచ్చేవని, అవి అందరితో పంచుకునేవారమని చెప్పారు. పెళ్లయ్యాకే వంట చేయడం నేర్చుకున్నానని, అప్పుడు యూట్యూబ్ వంటివి లేవని, పెద్దవాళ్ళను అడిగి స్వయంగా నేర్చుకున్నానని పేర్కొన్నారు. తన వివాహం తర్వాత జరిగిన ఒక సంఘటనను రాశి పంచుకున్నారు. పెళ్లి జరిగిన రెండు సంవత్సరాల తర్వాత, చెన్నై ఎయిర్‌పోర్టులో తన భర్త, తల్లితో కలిసి ఉండగా చిరంజీవిని చూశారని తెలిపారు. ఆ సమయంలో చిరంజీవి దగ్గరకు వెళ్లి, తన పెళ్లికి ఎవరినీ పిలవలేదని క్షమాపణ కోరారని, అప్పుడు చిరంజీవి ఏయ్ ఏంటే ఇక్కడ.? అని అడిగారని గుర్తుచేసుకున్నారు. తన పెళ్లి జరిగిందని చెప్పగానే, చిరంజీవి ఆశ్చర్యపోయి, తన భర్తను పరిచయం చేసుకున్న తర్వాత, చాలా సౌమ్యంగా ఉన్నాడే, మంచి అబ్బాయిని చేసుకున్నావు అని అభినందించారని రాశి తెలిపారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..