Jamuna Last Rites: ఇక సెలవు.. దివికేగిన తెలుగు తెర సత్యభామ.. ముగిసిన జమున అంత్యక్రియలు..

|

Jan 27, 2023 | 5:19 PM

జమునతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు సినీ ప్రముఖులు దగ్గుబాటి సురేశ్ బాబు, మురళీ మోహన్, సుబ్బరామిరెడ్డి, జీవిత రాజశేఖర్. సినీప్రపంచంలో ఆమె అద్భుత నటి అని కొనియాడారు. తొలితరం నటిగా వందలాది చిన జమునతో..తమకున్న జ్ఞాపకాలను స్మరించుకున్నారు.

Jamuna Last Rites: ఇక సెలవు.. దివికేగిన తెలుగు తెర సత్యభామ.. ముగిసిన జమున అంత్యక్రియలు..
Jamuna
Follow us on

అలనాటి అందాల తార జమున అంత్యక్రియలు ముగిశాయి. తెలుగువారి మనసు దోచుకున్న నటి అంతిమయాత్ర ముగిసింది. శుక్రవారం ఉదయం 86 ఏళ్ల జమున కన్నుమూసింది. ఆమె మరణంతో ఇండస్ట్రీ దిగ్ర్బాంతికి గురయ్యింది. ఆమె అంత్యక్రియల్లో ఏపీ మంత్రి రోజాతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‏లోని మహాప్రస్థానంలో జమున అంత్యక్రియలు నిర్వహించారు. జమున కుమార్తె స్రవంతి ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. హిందూ సంప్రదాయాలను అనుకరిస్తూ ఆమె తల్లి చితికి నిప్పు అంటించారు. అయితే జమునకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నాడని, రావడానికి ఆలస్యం కానున్నదని తెలియడంతో కుమార్తె స్రవంతినే తల్లి దహన సంస్కారాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. జమునతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు సినీ ప్రముఖులు దగ్గుబాటి సురేశ్ బాబు, మురళీ మోహన్, సుబ్బరామిరెడ్డి, జీవిత రాజశేఖర్. సినీప్రపంచంలో ఆమె అద్భుత నటి అని కొనియాడారు. తొలితరం నటిగా వందలాది చిన జమునతో..తమకున్న జ్ఞాపకాలను స్మరించుకున్నారు.

1953లో పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేశారు జమున. తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో ..మొత్తం 198 సినిమాల్లో నటించారు. తెలుగులో 145 చిత్రాల్లో నటించారు జమున. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, జగ్గయ్యలాంటి దిగ్గజ నటులతో నటించి మెప్పించారామె. ఐతే ఎన్ని పాత్రల్లో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం సత్యభామ క్యారెక్టరే. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జీవించారు జమున. అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మెప్పించారు. 1964లో విడుదలైన మూగమనసులు సినిమాలో నటనకు.. ఉత్తమ సహాయనటిగా ఫిలిం ఫేర్‌ అవార్డ్‌ లభించింది. 1972లో పండంటి కాపురం సినిమాకు ఫిల్మ్‌ ఫేర్‌ ప్రత్యేక అవార్డ్‌, 2008లో ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డ్ జమునను వరించాయి. జమున చివరి చిత్రం రాజపుత్ర రహస్యం. ఇక సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించారు జమున. 1980లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆమె..రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి.. పాతికేళ్ల పాటు ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించారు జమున.

ఇవి కూడా చదవండి

1936 ఆగస్ట్‌ 30న హంపీలో జన్మించారు జమున. తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. తండ్రి వ్యాపార రీత్యా.. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. 1965లో జమునకు రమణారావుతో వివాహం జరిగింది. జమున, రమణారావు దంపతులకు వంశీకృష్ణ, స్రవంతి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.