సీనియర్ నటుడు చలపతి రావు మరణంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. గత నాలుగు నెలల్లో పలువురు లెజండరీ నటులు మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. గత కొద్ది నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తోన్న ఆయనను బాబాయ్ అంటూ సినీ ప్రముఖులు ఆప్యాయంగా పిలిచుకుంటారు. స్వర్గీయ ఎన్టీఆర్ దగ్గర నుంచి దాదాపు నాలుగు తరాల హీరోలతో పనిచేసిన దిగ్గజ నటుడు చలపతి రావు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొడుకు రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన కుమారుడు రవిబాబు ఇంట్లో చలపతి రావు ఉంటున్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు1200కు పైగా చిత్రాల్లో సహయ నటుడిగానే కాకుండా ప్రతినాయకుడిగానూ మెప్పించిన ఆయన.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో తనకుంటూ మంచి పేరు సంపాదించుకున్న చలపతి రావు ఇమేజ్ ఐదు సంవత్సరాల క్రితం మసకబారింది. ఓ ఆడియో ఫంక్షన్ లో ఆయన చేసిన కామెంట్ అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. స్త్రీల గురించి నవ్వుతూ ఆయన చేసిన కామెంట్ పై మహిళలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో చలపతి రావుపై తీవ్రస్థాయిలో దుమారం రేగింది. ఆయనను దారుణంగా ట్రోల్ చేశారు. అయితే తన గురించి నెట్టింట్లో వచ్చిన కామెంట్స్ చూసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట చలపతి రావు. గతంలో అలీతో సరదాగా షోలో పాల్గొన్న ఆయన తన జీవితం గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
మహిళలను తాను ఏదో అన్నానని.. సోషల్ మీడియాలో తనపై దారుణంగా కామెంట్స్ చేశారని ఆయన చెప్పారు. తను అన్నది వేరు.. వాళ్లు కల్పించింది వేరని.. ఆడవాళ్లను తాను చాలా గౌరవిస్తానని.. 22 ఏళ్ల వయసులో భార్య చనిపోతే మళ్లీ పెళ్లి కూడా చేసుకోలేదని.. ఇండస్ట్రీలోని మహిళలు ఏనాడు ఒక్క మాట కూడా అనలేదని.. అలాంటి తనను అల్లరి చేశారని.. ఆసమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు తెలిపారు. మీ అందరికీ రుణపడి ఉంటాను ఆని సూసైడ్ నోట్ రాసిపెట్టాలనుకున్నారట. సోషల్ మీడియా అనే దరిద్రం తనకున్న మంచి పేరును చెడగొట్టిందని చెబుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. గతంలో చలపతి రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.