
కాంతారా సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో ఫేమస్ అయిపోయాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఈ సినిమాతో హీరోగానే కాదు డైరెక్టర్‌గానూ సత్తాచాటాడు రిషబ్. అంతకు ముందు చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ కూడా చేశాడు. అయితే కాంతారా సినిమాతోనే రిషబ్ క్రేజ్ నేషనల్ లెవెల్‌కి వెళ్లింది. కాగా ఇటీవల రిషబ్ శెట్టి పుట్టిన రోజు (జులై 7) వేడుకలు ఘనంగా జరిగాయి. సాధారణంగా ఇలాంటి హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉంటాడు కాంతారా హీరో. అయితే తనను కలిసేందుకు వచ్చిన వేలాదిమంది అభిమానుల కోసం బెంగళూరులోని తన నివాసంలోనే గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశాడు రిషబ్. ఫ్యాన్స్‌కు భోజన ఏర్పాట్లు చేసి తన మంచి మనసును చాటుకున్నాడు. వారితో ఆత్మీయంగా కలిసిపోయాడు. ఇదే సందర్భంగా రిషబ్ శెట్టి సతీమణి ప్రగతి శెట్టి ఒక మంచి ప్రకటన చేసింది. పేదలు, ఆనాథ పిల్ల చదువుల కోసం రిషబ్ శెట్టి ఫౌండేషన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది.
‘మా ఆయనకు బర్త్ డే కానుకలు అందుకోవడం ఇష్టముండదు. నచ్చదు కూడా. ఈ సంగతి పక్కన పెడితే మా ఆయన చాలా ఏళ్లుగా కర్ణాటకలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు సాయం చేస్తున్నారు. అయితే ఆయనెప్పుడూ ఈ విషయాన్ని బయట చెప్పుకోలేదు. ఇప్పుడు పిల్లల కోసం ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయనున్నాం’ అని చెప్పుకొచ్చింది ప్రగతి శెట్టి. ఇదే సందర్భంగా రిషబ్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ‘నా అభిమానులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. నా పుట్టిన రోజు సందర్భంగా ఇది సాకారమైనందుకు సంతోషంగా ఉంది’ అని భావోద్వేగానికి గురయ్యాడు రిషబ్. కాగా ప్రస్తుతం కాంతారాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నాడు రిషబ్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..