Ramam Raghavam Review: రామం రాఘవం మూవీ రివ్యూ.. తండ్రీ కొడుకుల ఎమోషనల్ డ్రామా..

ఈ మధ్య కమెడియన్లు దర్శకులుగా మారడం చూస్తున్నాం. బలగం సినిమాతో వేణు అలా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. తాజాగా అదే జబర్దస్త్ వేదిక, అక్కడ్నుంచే వచ్చిన మరో కమెడియన్ కమ్ నటుడు ధన్‌రాజ్ కూడా దర్శకుడిగా మారాడు. ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కిన మొదటి సినిమా రామం రాఘవం. సముద్రఖని లాంటి సీనియర్ నటుడితో తండ్రీ కొడుకుల డ్రామా తెరకెక్కించాడు ధన్‌రాజ్. మరి ఈ సినిమా ఎలా ఉంది..? దర్శకుడిగా ధన్‌రాజ్ సక్సెస్ అయ్యాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Ramam Raghavam Review: రామం రాఘవం మూవీ రివ్యూ.. తండ్రీ కొడుకుల ఎమోషనల్ డ్రామా..
Ramam Raghavam Review

Edited By: Rajitha Chanti

Updated on: Feb 20, 2025 | 8:53 PM

మూవీ రివ్యూ: రామం రాఘవం

నటీనటులు: ధన్‌రాజ్, సముద్రఖని, హరీష్ ఉత్తమన్, సత్య, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీరాజ్, ప్రమోదిని తదితరులు

సంగీతం: అరుణ్ చిలువేరు

ఇవి కూడా చదవండి

కథ: శివ ప్రసాద్ యానాల

సినిమాటోగ్రఫీ: దుర్గా ప్రసాద్ కొల్లి

ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్

దర్శకత్వం: ధన్ రాజ్ కొరనాని

నిర్మాత: పృథ్వీ పోలవరపు

ఈ మధ్య కమెడియన్లు దర్శకులుగా మారడం చూస్తున్నాం. బలగం సినిమాతో వేణు అలా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. తాజాగా అదే జబర్దస్త్ వేదిక, అక్కడ్నుంచే వచ్చిన మరో కమెడియన్ కమ్ నటుడు ధన్‌రాజ్ కూడా దర్శకుడిగా మారాడు. ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కిన మొదటి సినిమా రామం రాఘవం. సముద్రఖని లాంటి సీనియర్ నటుడితో తండ్రీ కొడుకుల డ్రామా తెరకెక్కించాడు ధన్‌రాజ్. మరి ఈ సినిమా ఎలా ఉంది..? దర్శకుడిగా ధన్‌రాజ్ సక్సెస్ అయ్యాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

దశరథ రామం (సముద్రఖని) రిజిస్టర్ ఆఫీసులో పనిచేసే ఓ సిన్సియర్‌ అధికారి. డ్యూటీయే ప్రాణంగా బతుకుతుంటాడు. నీతి, న్యాయంగా ఉంటాడు. లంచం తీసుకోడు, ఎలాంటి ప్రలోభాలకు లొంగడు. ఆయనకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు రాఘవ (ధన్‌రాజ్‌). చిన్నప్పటి నుంచి కొడుకు అంటే ప్రాణం. కానీ రాను రాను పెరుగుతున్న కొద్దీ పరమ బేవార్స్‌గా మారిపోతాడు కొడుకు రాఘవం. అది చూసి తండ్రిగా బాధ పడుతుంటాడు రామం. అంతే కాదు పెళ్లి చేసుకుంటే చాలు కట్నం వస్తుంది.. అలా లైఫ్ సెటిల్ అవుతుంది అనుకునే మెంటాలిటీ రాఘవది. దాంతో పాటు జీవితంలో ఒకదాని వెంట మరో తప్పులు చేస్తూనే ఉంటాడు రాఘవ. కొడుకు తీరు చూసి రామం కూడా విసిగిపోతాడు. కొడుకును మార్చాలని తిడతాడు, కొడతాడు కానీ బుద్ది రాదు. చివరికి తండ్రి సంతకాన్నే పోర్జరీ చేసి దొరికిపోతాడు. దీంతో తండ్రే కొడుకును పోలీసులకు అప్పగిస్తాడు. అయినా మారకపోగా.. ఏకంగా తన తండ్రినే చంపాలనుకుంటాడు రాఘవ. లారీ డ్రైవర్‌ అయిన స్నేహితుడు (హరీష్‌ ఉత్తమన్‌)తో కలిసి తండ్రిని చంపేందుకు ప్లాన్‌ చేస్తాడు. అసలు తన తండ్రి అంటే ఎందుకు రాఘవకు అంత కోపం.. చంపేంత తప్పు ఆ తండ్రి ఏం చేసాడు..? చివరికి తండ్రి గొప్పతనం కొడుకు తెలుసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ..

కథనం:

సాధారణంగా ఓ కమెడియన్ దర్శకుడిగా మారుతున్నాడు అంటే అంతా కామెడీ సినిమాతోనే వస్తున్నాడు అనుకుంటారు. కానీ అది తప్పని బలగంతో వేణు నిరూపించాడు. ఇప్పుడు ధన్‌రాజ్ కూడా ఇదే చేసాడు. ఇన్నాళ్లూ కమెడియన్‌గా ఉన్న ఈయన ఇప్పుడు దర్శకుడిగా మారిపోయాడు. అది కూడా ఓ మంచి ఎమోషనల్ డ్రామాతో. సిన్సియర్ తండ్రి, ఆవారా కొడుకు.. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో మంచి పాయింట్ పట్టుకున్నాడు ధన్‌రాజ్. కథ అంతా దాని చుట్టూనే తిప్పే ప్రయత్నం చేసాడు. ఫస్టాఫ్ చాలా వరకు కూడా రొటీన్ రెగ్యులర్ సినిమా లాగే ముందుకు సాగుతుంది. నిజాయితీ పరుడైన తండ్రి కొడుకును మార్చడానికి ప్రయత్నించడం.. కొడుకు మాత్రం ఎవరి మాటా వినకుండా తప్పు మీద తప్పు చేయడం.. ఇవన్నీ గౌతమ్ ఎస్ఎస్‌సీ లాంటి సినిమాల్లోనూ చూసాం. చివరికి సంతకం ఫోర్జరీ చేసిన తర్వాత మార్పు వస్తుందేమో అనుకుంటాం కానీ అక్కడ్నుంచి కథ మరో మలుపు తిరుగుతుంది. రాఘవ తన తండ్రిని చంపాలనుకున్న తర్వాత కథనంలో వేగం పెరుగుతుంది.. కథపై ఆసక్తి కలుగుతుంది. నెక్ట్స్ ఏం జరగబోతుందో అనే క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో దర్శకుడిగా ధన్‌రాజ్ సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ కాస్త రొటీన్‌గానే వెళ్లినా.. సెకండ్ హాఫ్ మాత్రం ఊహించని ట్విస్టులు ఇచ్చారు. ప్రీ క్లైమాక్స్ నుంచి కథ మరింత ఎమోషనల్‌గా ముందుకు వెళ్తుంది. కచ్చితంగా చివర్లో వీక్ హార్ట్ ఉన్న వాళ్లైతే కన్నీరు పెట్టుకుంటారు. అంత బాగా రాసుకున్నాడు ధన్‌రాజ్. తండ్రీ కొడుకుల మధ్య పతాక సన్నివేశాలు చాలా బాగా వర్కవుట్ అయ్యాయి. థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు మాత్రం మంచి సినిమా చూసామనే ఫీల్‌తోనే వచ్చే అవకాశం అయితే లేకపోలేదు.

నటీనటులు:

ధనరాజ్ అంటే మనకు ఇన్ని రోజులు కేవలం కామెడీ మాత్రమే చేస్తాడు అనే ముద్ర ఉంది. కానీ ఈ సినిమాతో అది తుడిచేసి ఏడిపించే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో ఎంత బేవార్స్‌గా కనిపించాడో.. సెకండాఫ్‌లో అంత మెచ్యూరిటీ తీసుకొచ్చాడు. సముద్రఖని అద్భుతంగా నటించాడు. ఆయన సినిమాకు ప్రాణం. రామం పాత్రను నిలబెట్టాడు. హరీష్ ఉత్తమన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ టీం:

రామం రాఘవం సినిమాకు సంగీతం ప్రధానం. పాటలు అంతంతమాత్రంగానే ఉన్నా ఆర్ఆర్ మాత్రం చాలా బాగుంది. ఈ విషయంలో సంగీత దర్శకుడు అరుణ్ సక్సెస్ అయ్యాడు. దుర్గా ప్రసాద్ సినిమాటోగ్రఫి వర్క్ బాగానే ఉంది. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ కూడా పర్లేదు. నిర్మాత పృథ్వీ పోలవరపు కథకు తగ్గట్లు ఖర్చు చేసాడు. దర్శకుడిగా ధన్‌రాజ్ గురించి చెప్పుకోవాలి.. ఆయన నటుడిగా కంటే కూడా ఈ సినిమాలో దర్శకుడిగానే ఎక్కువ మార్కులు వేయించుకున్నాడు. ముఖ్యంగా సెకండాఫ్ టేకింగ్ అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ అయితే బాగా రాసుకున్నాడు. ఓవరాల్‌గా మంచి సినిమాతోనే డెబ్యూ చేసాడు.

పంచ్ లైన్:

రామం రాఘవం.. తండ్రీ కొడుకుల ఎమోషనల్ డ్రామా..!