Rakul Preet Singh: అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చేరింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడింది. ఇక తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తోన్న సమయంలోనే బాలీవుడ్ బాట పట్టిందీ చిన్నది. అక్కడ కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది.
రకుల్ హీరోయిన్‌గా నటించిన ‘చెక్’ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్‌గా నటించి మార్కులు కొట్టేసింది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల మీడియాతో మాట్లాడిన ఈ చిన్నది పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చెక్ సినిమా స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది అందుకే వెంటనే ఓకే చెప్పానని, ఈసినిమా ఏ తరహా చిత్రమనే విషయాన్ని ఆలోచించలేదని చెప్పుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలో నేను ఎవరితో పోటీ పెట్టుకోనని.. నాతో నాకే పోటీ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. గత సినిమాకు ఈ సినిమాకు నా నటన మెరుగవ్వాలనే కోరుకుంటున్నానని, చెక్ సినిమాలో అది చాలా ఇంప్రూవ్ అయ్యిందని చెప్పింది. ఇక తన తర్వాతి చిత్రం గురించి మాట్లాడిన రకుల్ క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తోన్న సినిమాలో నటిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో రకుల్ పల్లెటూరు అమ్మాయిగా నటించనున్నట్లు తెలిపింది. ఇక మారుతోన్న సినిమాల ట్రెండ్ గురించి మాట్లాడిన రకుల్.. ఒకప్పుడు కమర్షియల్ కాదన్న సినిమాలే ఇప్పుడు కమర్షియల్ సినిమాలు అయ్యాయని చెప్పుకొచ్చింది. ప్రేక్షకుల అభిరుచుల్లోనూ మార్పులు వస్తున్నాయి. హాలీవుడ్ సినిమాలతో పాటు, ఓటీటీల్లోనూ మంచి కంటెంట్ చూస్తున్నారు. అందువల్ల ఎప్పుడూ విభిన్నమైన సినిమాలు ప్రయత్నిస్తూ ఉండాలి. మళ్లీ తీసిన సినిమాలే తీస్తే ఆడియన్స్‌కి బోర్ కొడుతుంది అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ.