Maa Elections: ఈసారి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మద్యాహ్నం 3గంటలకు ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకూ మా ఎన్నికల చరిత్రలో జరగని విధంగా రికార్డ్ స్థాయిలో 626 ఓట్లు పోలయ్యాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ ద్వారా 41 ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం 883 మంది ఓటు హక్కు ఉన్న సభ్యులుండగా 665 ఓట్లు నమోదు కావడం ఓ రికార్డ్ ని చెప్పవచ్చు. రికార్డు స్థాయిలో 72 శాతం ఓట్లు పోలవడం విశేషం.
అయితే ఈసారి కృష్ణం రాజు, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రానా, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సుధీర్ బాబు, నాగ చైతన్య, రామ్ , నితిన్ వంటి హీరోలు తమ ఓటు హక్కుని వినియోగించుకోలేదు. ఇక హీరోయిన్లలో సమంత, హన్సిక, అనుష్క , త్రిష వంటి స్టార్ హీరోయిన్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు.
మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పోటీ చేసిన అనసూయ చివరి నిమిషంలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ట్రాఫిక్ జామ్‌తో పోలింగ్ కేంద్రానికి ఆలస్యంగా వచ్చినట్లు తెలుస్తోంది.