
మెగాస్టర్ చిరంజీవి గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్ పై పోలీస్ కేసు నమోదైంది. చిరంజీవి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఓ యూట్యూబ్ ఛానెల్ మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలతో ప్రచారం చేస్తుంది. యూట్యూబ్ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమాజంలో ఎంతో ప్రతిష్ట ఉన్న చిరంజీవి లాంటి వ్యక్తి పై బోగస్ వీడియోలతో దుష్ప్రచారం చేసి ఆయన ప్రతిష్టకు బంగం కలిగించే వారిని శిక్షించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
కాగా ఈ కేసు పై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లో కమలాపురి కాలనీకి చెందిన ప్రముఖ న్యాయవాది రామకృష్ణ మిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరంజీవి పై అసత్య ప్రచారం చేసిన వారిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ చిరంజీవి ఆరోగ్యంపై పూర్తిగా అవాస్తవమైన, అభ్యంతరకరమైన కంటెంట్‌ను రూపొందించిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో ఆయన పై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాగే సమాజంలో అలజడి సృష్టించేలా, అభిమానులను ఆందోళనకు గురిచేసేలా ఉన్న మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలను సదరు ఛానల్ సోషల్ మీడియాల్లో, యూట్యూబ్ లో వైరల్ చేసిందని రామకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేశారు లాయర్ రామకృష్ణ. స్క్రీన్ షాట్లు, వీడియో లింకులను అందించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. నిబంధనల ప్రకారం కోర్టు అనుమతిని తీసుకున్నారు పోలీసులు..