పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలు.. ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు వారాహి యాత్రలో పాల్గొంటూనే.. కాస్త సమయం దొరికితే చాలు తన చిత్రాలను కంప్లీ్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బ్రో మూవీ చిత్రీకరణ పూర్తి కాగా.. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ట్విట్టర్ ఖాతాలో యాక్టివ్గా ఉండే పవన్.. కొద్ది రోజుల క్రితం ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ చేశారు. ఇన్ స్టాలోకి పవన్ ఎంట్రీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే 2 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ అయ్యారు. అయితే ఇప్పటివరకు ఒక్క పోస్ట్ చేయని పవన్.. శనివారం సాయంత్రం మొదటి పోస్ట్ చేశారు. అందులో ఫిల్మ్ ఇండస్ట్రీలో తనతోపాటు భాగమైన ఎంతోమంది సినీ ప్రముఖులు నటీనటులతో కలిసి ఉన్న ఫోటోలను జత చేస్తూ ఓ వీడియో షేర్ చేసుకున్నారు. చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో కలిసి నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుడిని అంటూ రాసుకొచ్చారు.
ఆ వీడియోలో సీని కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకు తనతోపాటు నటించిన నటీనటులు, డైరెక్టర్స్, తోటి స్టార్స్ ఫోటోలను వీడియోగా మార్చారు. అయితే అందులో పవన్ ప్రస్తుతం నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమా పిక్ కూడా కనిపించింది. నిధి అగర్వాల్ వెనక నడుస్తున్న ఫోటో ఆ వీడియోలో ఉంది. కానీ ఆ ఫోటోను ఇప్పటివరకు చిత్రయూనిట్ రిలీజ్ చేయలేదు. దీంతో ఇప్పుడు ఆ పిక్ నెట్టింట వైరలవుతుండగా.. పవన్, నిధి క్యూట్ లుక్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ చాలా కాలంగా సైలెంట్ అయ్యింది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి మరో అప్డేట్ రాలేదు.
ఇదిలా ఉంటే.. తెలుగు సినీ పరిశ్రమలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని.. పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు నిధి. హరి హర వీరమల్లు టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు అంటూ తన ఇన్ స్టా స్టోరీలో పవన్ ఫస్ట్ పోస్ట్ షేర్ చేసింది నిధి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.