Rashmika Mandanna: సినిమాలు, యాడ్స్‌తోనే కాదు.. మరో విషయంలోనూ రికార్డ్ సృష్టించిన నేషనల్ క్రష్!
చిన్న సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసి టాలీవుడ్, బాలీవుడ్‌తోపాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్నారు. పుష్ప సిరీస్ సినిమాలలో శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించారు. తెలుగుతోపాటు పాన్ ఇండియా ప్రేక్షకుల గుండెల్లో స్ధానాన్ని సుస్ధిరం చేసుకున్నారు.

కర్ణాటకలోని కొడగు జిల్లాకు చెందిన ఆ కన్నడ కస్తూరి, సినిమా రంగంలో అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగారు. అయితే తాజాగా ఆమె తన సొంత జిల్లాలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా వార్తల్లో నిలిచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడు త్రైమాసికాలకు గానూ ఆమె ఏకంగా రూ. 4.69 కోట్ల పన్ను చెల్లించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఒక నటిగా సంపాదిస్తూనే, ప్రభుత్వానికి పన్ను చెల్లించడంలోనూ నంబర్ వన్ స్థానంలో నిలిచి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కిరిక్ పార్టీ నుంచి గ్లోబల్ స్టార్ వరకు..
కొడగు జిల్లా విరాజ్‌పేటకు చెందిన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా ‘కిరిక్ పార్టీ’తో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ‘చలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ‘గీత గోవిందం’తో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూనే జిల్లాలోనే టాప్ టాక్స్ పేయర్‌గా నిలవడం విశేషం.
కేవలం నటనలోనే కాదు, ఫిట్‌నెస్ విషయంలోనూ ఈ భామ ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా రోజుకు కనీసం గంటన్నర పాటు వ్యాయామం చేయడం ఆమె దినచర్యలో భాగం. ఆమె ఎక్కువగా కిక్ బాక్సింగ్, స్కిప్పింగ్ , యోగాకు ప్రాధాన్యత ఇస్తారు. ఇక కెరీర్ పరంగా చూస్తే, 2025 ఆమెకు గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి.
ఇప్పటికే ‘పుష్ప 2’తో సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం ‘సికందర్’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు 2026లో విడుదల కానున్న ‘పుష్ప 3’, ‘మైసా’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. గ్లామర్ పాత్రలే కాకుండా, ‘చావా’ వంటి చారిత్రాత్మక చిత్రాల్లో వీరనారిగా కనిపించి తనలోని వైవిధ్యమైన నటిని ప్రేక్షకులకు పరిచయం చేశారు.
పెళ్లి కబురు వచ్చేసింది..
ఇక రష్మిక వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ఈమె ప్రేమలో ఉన్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. వీరిద్దరి నిశ్చితార్థం హైదరాబాద్‌లోని విజయ్ నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిందని సమాచారం. అయితే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, 2026 ఫిబ్రవరి 26న వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా అత్యంత వైభవంగా ఈ పెళ్లి జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇరు కుటుంబాలు ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సరైన సమయంలో ఈ విషయం గురించి వెల్లడిస్తానని ఆ భామ ఇప్పటికే హింట్ ఇచ్చారు. మరి ఈ ‘క్రష్’ జోడీ పెళ్లిపీటలెక్కే ఆ క్షణం కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
