Heart Attack: పునీత్‌ నుంచి తారకరత్న వరకు.. సెలబ్రిటీలను కలవరపెడుతోన్న హార్ట్ ఎటాక్.. 18 నెలల్లో 7గురు..

Taraka Ratna Passed Away: గుండెపోటుతో ఇటీవల తరచూ సెలబ్రిటీలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. నిండా 40 ఏళ్లు నిండని వారిని కూడా హార్ట్‌ ఎటాక్‌ ప్రాణాలు తీస్తోంది.

Heart Attack: పునీత్‌ నుంచి తారకరత్న వరకు.. సెలబ్రిటీలను కలవరపెడుతోన్న హార్ట్ ఎటాక్.. 18 నెలల్లో 7గురు..
Nandamuri Tarakaratna

Updated on: Feb 19, 2023 | 5:46 AM

Taraka Ratna Passed Away: గుండెపోటుతో ఇటీవల తరచూ సెలబ్రిటీలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. నిండా 40 ఏళ్లు నిండని వారిని కూడా హార్ట్‌ ఎటాక్‌ ప్రాణాలు తీస్తోంది. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా కనిపించిన మనిషి గుండెపోటు రాగానే విగతజీవిగా మారిపోవడం అటు కుటుంబీకులను, ఇటు అభిమానులను కూడా తీరని శోకాన్ని మిగుల్చుతోంది.

గుండెపోటు.. హార్ట్‌ ఎటాక్‌.. కార్డియాక్‌ అరెస్ట్‌.. పేరేదైనా ఇది యువత అర్థాంతరంగా తనువు చాలించేలా చేస్తోంది. గతంలో స్థూలకాయం ఉన్న వారికి హార్ట్‌ ఎటాక్‌ ఎక్కువగా వచ్చేది. అయితే ఇప్పుడు భారీకాయం ఉన్న వారికే కాదు.. సన్నగా ఉన్నవారికైనా గుండెపోటు వస్తోంది. నిత్యం వర్కౌట్స్‌ చేసే వారిని కూడా ఇది వదలడం లేదు. దీంతో ఉజ్వల భవిష్యత్‌ ఉన్న ఎంతో మంది యువత గుండెపోటుకు బలవుతున్నారు. ఇటీవల సెలబ్రిటీలు చాలా మంది హార్ట్‌ ఎటాక్‌తో మృతి చెంది, ఇటు కుటుంబ సభ్యులకు, అటు అభిమానులకు తీరని దు:ఖాన్ని మిగిల్చి వెళ్లారు.

జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ కన్నడ యువనటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ హార్ట్‌ ఎటాక్‌ తో మృతి చెందడం అభిమానులకు శోకసంద్రంలో ముంచెత్తింది. 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో చనిపోయాడు పునీత్‌. 2021 అక్టోబర్‌ 29న మృతి చెందాడు. అప్పు అని అభిమానులు పిలుచుకునే పునీత్‌ చెప్పలేని విషాదాన్ని మిగిల్చి వెళ్లిపోయాడు. అయితే అధికంగా వర్కౌట్‌ చేయడం కూడా గుండెపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఏపీలో ఐటిశాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి కూడా హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయారు. 2022 ఫిబ్రవరి 21న మృతి చెందారు గౌతమ్‌రెడ్డి. 49 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మృతి చెందాడు గౌతమ్‌రెడ్డి. నిత్యం వర్కౌట్స్‌ చేసే గౌతమ్‌రెడ్డికి హార్ట్‌ ఎటాక్‌ రావడం కుటుంంబ సభ్యులు, బంధువులను షాక్‌ కు గురి చేసింది.

ప్రముఖ గాయకుడు కెకె కూడా హార్ట్‌ ఎటాక్‌తో మృతి చెందడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కోల్‌కతాలోని ఓ కాలేజీ ఫెస్ట్‌లో పాటల ప్రదర్శన ఇస్తున్న సమయంలోనే హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. హిందీ, తెలుగు, తమిళ్‌ , మలయాళం, బెంగాళీ భాషల్లో ఎన్నో హిట్‌ సాంగ్స్‌ని పాడిన కెకె 53 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి చెందాడు. 2022 మే 31న మరణించాడు కెకె.

నటుడు సిద్ధార్థ్‌ శుక్లా కూడా 40 ఏళ్లకే హార్ట్‌ ఎటాక్‌తో మృతి చెందాడు. బాలికా వధు, బిగ్‌బాస్‌ సీజన్‌ 13 ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సిద్ధార్థ్‌ శుక్లా. నిద్రలోనే గుండెపోటు రావడంతో మరణించాడు సిద్ధార్థ్‌ శుక్ల. చనిపోయే ముందు రోజు రాత్రి 3 గంటల పాటు జిమ్‌ చేశాడు. రాత్రి 10 గంటల వరకు జిమ్‌ చేసి, ఇంటికి వచ్చి తినేసి పడుకున్నాడు. అయితే తెల్లవారుజామున 3 గంటలకు గుండెలో నొప్పి అని చెప్పడంతో అతని తల్లి ఏదో ట్యాబ్లెట్‌ ఇవ్వడంతో పడుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ లేవ లేదు సిద్ధార్థ్‌ శుక్ల. 2021 సెప్టెంబర్‌ 2న మృతి చెందాడు.

ప్రముఖ టీవీ నటుడు సిద్ధాంత్‌ వీర్‌ సూర్యవంశీ కూడా హార్ట్‌ ఎటాక్‌తోనే చనిపోయాడు. జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ముంబైలోని ఓ హాస్పిటల్‌కి తరలించినా, ఫలితం లేకుండాపోయింది. 46 ఏళ్ల వయసులో 2022 నవంబర్‌ 11న మృతి చెందాడు.

హాస్య నటుడు రాజు శ్రీవాత్సవ కూడా గుండెపోటుతోనే కన్నుమూశారు. జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ కుప్పకూలడంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఆ తర్వాత 41 రోజులకు చనిపోయాడు. ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌లో స్టాండప్‌ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజు శ్రీవాత్సవ. 2022 సెప్టెంబర్‌ 21న కన్నుమూశాడు.

ఇప్పుడు నందమూరి తారకరత్న కూడా 40 ఏళ్ల వయసులోనే హార్ట్‌ ఎటాక్‌తో మృతి చెందాడు. జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన లోకేష్‌ పాదయాత్రలో గుండెపోటు రాగా, 23 రోజుల పాటు బెంగళూర్‌లోని హృదయాలయ హాస్పిటల్‌లో చికిత్స అందించారు. విదేశీ వైద్యులతో ట్రీట్‌మెంట్‌ అందించినా ఫలితం లేకుండా పోయింది. హార్ట్‌ ఎటాక్‌తో యువత చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.