Daaku Maharaaj: ‘మీ ఊహలకు మించి ఉంటుంది’.. డాకు మహారాజ్‌పై అంచనాలు పెంచేసిన బాలయ్య

|

Jan 11, 2025 | 6:31 AM

'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన మరో వైవిద్యభరితమైన చిత్రం 'డాకు మహారాజ్'. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

Daaku Maharaaj: ‘మీ ఊహలకు మించి ఉంటుంది.. డాకు మహారాజ్‌పై అంచనాలు పెంచేసిన బాలయ్య
Daaku Maharaaj
Follow us on

బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం డాకు మహారాజ్ . శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది.

ఈ సందర్భంగా ‘డాకు మహారాజ్’ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయనే పేరు వచ్చింది. ఇక ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ అంతకుమించి అనేలా ఉంది. “వాడి ఒంటి మీద పదహారు కత్తి పోట్లు, ఒక బుల్లెట్ గాయం.. అయినా కిందపడకుండా అంత మందిని నరికాడంటే అతను మనిషి కాదు, వైల్డ్ యానిమల్” అనే డైలాగ్ తో బాలకృష్ణ పాత్ర ఎంత శక్తివంతంగా ఉండబోతుందో తెలిపారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారని రిలీజ్ ట్రైలర్ తో మరోసారి స్పష్టమైంది. అలాగే బాలకృష్ణ సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగ్ లకు పెట్టింది పేరు. ‘డాకు మహారాజ్’లోనూ అలాంటి డైలాగ్ లకు కొదవ లేదని రిలీజ్ ట్రైలర్ తో రుజువైంది. “రాయలసీమ మాలూమ్ తేరే కో. ఓ మేరా అడ్డా”, “ఎవరన్నా చదవడంలో మాస్టర్స్ చేస్తారు.. నేను చంపడంలో చేశా” వంటి డైలాగ్ లతో బాలకృష్ణ అదరగొట్టారు. అలాగే రిలీజ్ ట్రైలర్ లో విజువల్స్, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నాయి.

ప్రీ రిలీజ్ వేడుకలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, “తిరుమల తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. బాధాకర ఘటన చోటు చేసుకోవడంతో అనంతపురంలో తలపెట్టిన వేడుకను రద్దు చేయడం జరిగింది. నా అభిమానులు క్రమశిక్షణ కలిగిన సైనికులు. అందుకే వారు మా నిర్ణయాన్ని స్వాగతించారు. ఇన్ని లక్షల, కోట్ల మంది అభిమానులను పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చి, నన్ను ఆయన ప్రతిరూపంగా మీ హృదయాల్లో నిలిపిన దైవాంశ సంభూతులు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావుకి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాన్న గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, ఆయన మాదిరిగానే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించుకుంటూ వస్తున్నాను. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాల్లో నేను పోషించిన పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. అలాగే అప్పట్లో ‘ఆదిత్య 369’లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి పాత్ర చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచి ఈ ‘డాకు మహారాజ్’ కథ పుట్టింది. ఈరోజు విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. బాలకృష్ణ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అందుకు తగ్గట్టుగా ఈ ట్రైలర్ ఉంది. దర్శకుడు బాబీ ఆలోచనకు తగ్గట్టుగా, కెమెరామెన్ విజయ్ కన్నన్ గారు తన అద్భుత పనితీరుతో సన్నివేశాలకు ప్రాణం పోశారు. తమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఖండ తరహాలో మరోసారి అద్భుతమైన సంగీతం అందించాడు. ఎడిటర్స్ రూబెన్, నిరంజన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఫైట్ మాస్టర్ వెంకట్ ఇలా టీం అంతా మనసు పెట్టి పని చేశారు. ప్రతిభగల నటీమణులు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతమైన పాత్రలు పోషించారు. యానిమల్ రాకముందే బాబీ డియోల్ గారిని ఈ సినిమాలో తీసుకున్నాం. ఆయన పాత్ర కూడా చాలా బాగుంటుంది. మూడు వరుస ఘన విజయాల తర్వాత వస్తున్న ‘డాకు మహారాజ్’తో మరో ఘన విజయాన్ని అందుకుంటాననే నమ్మకముంది. ఇక ముందు కూడా ఇలాగే మరిన్ని మంచి సినిమాలతో మీ ముందుకు వస్తున్నాను. సంక్రాంతికి విడుదలైన నా సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతున్న ‘డాకు మహారాజ్’ కూడా ఘన విజయం సాధిస్తుంది. మీరు ఏం ఊహించుకుంటున్నారో అంతకంటే మించే ఈ సినిమా ఉంటుంది. అందరికీ సంక్రాంతికి శుభాకాంక్షలు.” అన్నారు.

ఇవి కూడా చదవండి

దర్శకుడు బాబీ కొల్లి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు థమన్, కథానాయికలు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, వైజాగ్ ఎంపీ భరత్, నందమూరి తేజస్విని, ఛాయాగ్రాహకుడు విజయ్ కన్నన్, రచయిత మోహన్ కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ‘డాకు మహారాజ్’ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి