
ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం (ఏవిఎస్) తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. హాస్య నటుడిగా సుపరిచితులైన ఆయన, అంతకు మించి ఒక నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా విశేష సేవలు అందించారు. ఏవిఎస్ 1957లో కృష్ణా జిల్లాలోని కళాకారుల నిలయం తెనాలిలో ఆమంచి వీరరాఘవయ్య, శివకామేశ్వరి దంపతులకు జన్మించారు. తెనాలిలోని ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, విఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నతనం నుండే రచనల పట్ల ఆసక్తి ఉన్న ఆయన, పాత కళాకారులతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌లను అనుకరించడంలో అసాధారణమైన మిమిక్రీ ప్రతిభను కనబరిచేవారు. కాలేజ్ లో ఉపాధ్యాయులు ఆయన ప్రతిభను గుర్తించి నాటకాల్లో అవకాశాలు కల్పించారు. ఏవిఎస్ ఏదైనా పాత్ర గురించి చెప్పగానే, దానిని తక్షణమే గ్రహించి, ఆ పాత్ర తాలూకు బాడీ లాంగ్వేజ్‌ని పట్టుకుని అద్భుతంగా ప్రదర్శించేవారు. తాజాగా సీనియర్ దర్శకుడు నందం హర్చంద్ర రావు ఏవీఎస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఏవీఎస్ గురించి నందం హర్చంద్ర రావు మాట్లాడుతూ.. డిగ్రీ పూర్తయిన తర్వాత, ఏవిఎస్ ఉదయం పత్రికలో స్టాఫ్ రిపోర్టర్‌గా తన జర్నలిజం ప్రస్థానాన్ని ఒంగోలులో ప్రారంభించారు. ఏ కథనం రాయాలన్నా ప్రత్యక్షంగా వెళ్లి పరిశోధించి, నిర్ధారించుకున్న తర్వాతే రాసేవారు. పాము చర్మాల స్మగ్లింగ్, అమ్మాయిల అక్రమ రవాణా వంటి విషయాలపై ఆయన రాసిన సంచలనాత్మక కథనాలు ఉదయం పత్రికకు, ఏవిఎస్కు ఎంతో పేరు తెచ్చాయి. ఈ క్రమంలో, స్మగ్లర్ల నుంచి ఆయన ప్రాణాపాయాన్ని కూడా ఎదుర్కొన్నారు, అయితే పోలీస్ రక్షణతో బయటపడ్డారు. ఉదయం పత్రిక మూతపడిన తర్వాత, ఏవిఎస్ ఆంధ్రజ్యోతిలో చేరి, అక్కడ కూడా తనదైన శైలిలో సమస్యలను కథల రూపంలో ఆసక్తికరంగా రాస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. తన వ్యక్తిగత జీవితంలో కూడా ఏవిఎస్ విలువలకు ప్రాధాన్యతనిచ్చారు. జర్నలిస్టుగా సంపాదించిన జీతంతో సంతృప్తి చెంది, విలాసవంతమైన జీవితానికి దూరంగా, నిరాడంబరంగా జీవించారు. నాటకాల్లో నటిస్తున్న సమయంలో తోటి డ్రామా ఆర్టిస్ట్ ఆశా కిరణ్మయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు.
ఒక సందర్భంలో, విజయవాడకు వచ్చిన ముళ్ళపూడి వెంకటరమణకు ఏవిఎస్ తన మిమిక్రీ, ముఖ్యంగా నత్తి పాత్రను ప్రదర్శించారు. ముళ్ళపూడి వెంకటరమణ బాపు గారికి ఏవిఎస్ గురించి చెప్పగా, బాపు మిస్టర్ పెళ్ళాం చిత్రం తీస్తున్న సమయంలో బాపు ఏవిఎస్కు ఒక పాత్రను ఇచ్చారు. ఈ సినిమా అనూహ్య విజయం సాధించడంతో ఏవిఎస్కు విపరీతమైన పాపులారిటీ లభించింది. వాస్తవానికి, మిస్టర్ పెళ్ళాం కంటే ముందు బాపు దర్శకత్వంలో, ఎన్.టి. రామారావు సొంత చిత్రమైన శ్రీనాథ కవిసార్వభౌముడులో తమిళ కవి పాత్రను ఏవిఎస్ పోషించారు. ఈ చిత్రం ఆలస్యంగా విడుదల కావడంతో మిస్టర్ పెళ్ళాం ఆయనకు మొదటి విజయాన్ని అందించింది. జర్నలిస్టుగా, నటుడిగా మాత్రమే కాకుండా, ఏవిఎస్ రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా తెలుగు సినిమాకు తనదైన విశిష్ట సేవలు అందించారు.