ఆమె నా మాటలు వినలేదు.. తలుచుకుంటే ఎంతో బాధగా అనిపిస్తుంది.. ఎమోష్నలైన మోహన్ బాబు..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. అత్యధిక బడ్జెట్‌తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. న్యూజిలాండ్ అడవులతోపాటు.. రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేసి కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ చేశారు మేకర్స్.

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న చిత్రం కన్నప్ప. హిందీ మహా భారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
ముఖ్యంగా సినిమాలోని పాత్రధారుల ఫస్ట్ లుక్ పోస్టర్లను పేర్లతో సహా రివీల్ చేశారు మేకర్స్. వీటికి అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక సాంగ్స్ కు కూడా మంచి స్పందన వస్తోంది. జూన్ 27న కన్నప్ప సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మోహన్ బాబు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆయన తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యేరు. ‘మై కన్నప్ప స్టోరీ’ అనే వీడియోను విడుదల చేస్తూ, తన తల్లిని ‘నా కన్నప్ప’గా పేర్కొన్నారు. ఈ వీడియోలో ఆయన తన తల్లితో ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని, ఆమె నుంచి తాను పొందిన ప్రేరణను తెలిపారు మోహన్ బాబు.
మోహన్ బాబు మాట్లాడుతూ.. తన తల్లి లక్ష్మమ్మే తన జీవితంలో కన్నప్ప అని అన్నారు. కన్నప్ప, ఒక అమాయకుడు, ఆటవికుడైన తిన్నడు పరమేశ్వరుడి కోసం తన కళ్లను అర్పించి చరిత్రలో నిలిచిపోయాడని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా, తల్లిదండ్రులు తమ పిల్లల ఆకలిని తెలుసుకుని, వారి శక్తికి మించి అన్నీ సమకూర్చుతారని, అందుకే తన దృష్టిలో తల్లిదండ్రులు కన్నప్పలతో సమానమని ఆయన అన్నారు. మోహన్ బాబు తన తల్లి లక్ష్మమ్మ గురించి మాట్లాడుతూ.. ఆమె పుట్టుకతోనే చెవిటిదని, అయినప్పటికీ దేవుడు ఆమెకు ఐదుగురు సంతానాన్ని ప్రసాదించాడని చెప్పారు. అయితే మా ఊరు వెళ్లాలంటే ఒక చోట బస్సు దిగి 7 కిలో మీటర్లు నడిచి వెళ్ళాలి.. మా అమ్మ మా ఐదుగురిని మోసుకుంటూ వెళ్ళేది.. ఆ రోడ్డు కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. అందరూ నా కంఠాన్ని మెచ్చుకుంటుంటే.. నా కన్నతల్లి నా మాటలు వినలేదు అని ఎంతో బాధపడేవాడిని.. నాకు నా తల్లే కన్నప్ప అంటూ ఎమోషనల్ అయ్యారు మోహన్ బాబు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








