AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi : మెగాస్టార్‌తో కొండా సురేఖ భేటీ.. ఆ పదం ప్రస్తావనతో కొత్త చర్చ..!

మెగాస్టార్ చిరంజీవితో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. తాజాగా ఆయన జూబ్లీహిల్స్ నివాసానికి తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వెళ్లడం అనుకోకుండా ఆసక్తిని రేపింది. చిరంజీవిని కలిసిన సందర్భంగా ఆయనకు అత్యంత అభిమానమైన ఆంజనేయస్వామి చిత్రపటాన్ని బహూకరించారు మంత్రి సురేఖ

Chiranjeevi : మెగాస్టార్‌తో కొండా సురేఖ భేటీ.. ఆ పదం ప్రస్తావనతో కొత్త చర్చ..!
Chiranjeevi, Konda Surekha
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Feb 03, 2026 | 5:26 PM

Share

ఒక్క ఫోటో.. రాజకీయాల్లో కొత్త చర్చకు దారి చేసింది. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండి.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ తాజాగా ఆయన జూబ్లీహిల్స్ నివాసానికి తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వెళ్లడం అనుకోకుండా ఆసక్తిని రేపింది. చిరంజీవిని కలిసిన సందర్భంగా ఆయనకు అత్యంత అభిమానమైన ఆంజనేయస్వామి చిత్రపటాన్ని బహూకరించారు మంత్రి సురేఖ. ఈ భేటీకి ఆమె కుమార్తె కొండా సుస్మిత కూడా హాజరయ్యారు. మొత్తం కార్యక్రమం మర్యాదపూర్వకంగానే సాగినప్పటికీ.. అసలు చర్చకు కారణం మాత్రం ఆ భేటీ తర్వాతే మొదలైంది. మంత్రి కొండా సురేఖ ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చిరంజీవిని కేంద్ర మాజీ మంత్రిగా సంబోధించడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది.

ప్రజారాజ్యం పార్టీ స్థాపన నుంచి కాంగ్రెస్‌లో విలీనం, రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రిగా పని చేసిన నేపథ్యం చిరంజీవికి ఉన్నా.. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక మంత్రి ఇలా చిరంజీవిని కలవడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందా? లేక ఇది కేవలం వ్యక్తిగత మర్యాదకే పరిమితమా? అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.

నెటిజన్లు మాత్రం తమదైన కోణాల్లో విశ్లేషణలు చేస్తున్నారు. రామ్ చరణ్–ఉపాసన దంపతులకు ఇటీవల కవల పిల్లలు పుట్టిన నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పేందుకే మంత్రి వెళ్లారన్న వాదన ఒకటి. కొండా సుస్మిత చిరంజీవి అభిమానిని కావడంతో ఆయన్ని కలవాలన్న కోరికతో ఈ భేటీ జరిగిందన్న అభిప్రాయం మరోటి. ఏది ఏమైనా.. రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని చిరంజీవి ఇప్పటికే స్పష్టత ఇచ్చినప్పటికీ, ఒక్క భేటీతో ఆయన పేరు మళ్లీ రాజకీయ చర్చల్లోకి రావడం మాత్రం మెగాస్టార్ ప్రభావం ఇప్పటికీ చెక్కుచెదరలేదన్న విషయాన్ని గుర్తు చేస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..