AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీలాగే నాకు ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీకే మొగుడు అయ్యాడు..

టాలీవుడ్ ఇండస్ట్రీని 'చిరంజీవికి ముందు.. చిరంజీవి తర్వాత' అని విభజించవచ్చు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు.. ఎలా 'మెగాస్టార్‌'గా ఎదిగారు? గతంలో ఒక ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు మురళీ మోహన్ పంచుకున్న విషయాలు..

నీలాగే నాకు ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీకే మొగుడు అయ్యాడు..
Murali Mohan
Ravi Kiran
|

Updated on: May 09, 2026 | 12:12 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ నేపధ్యం లేకుండా ఒక సామాన్య యువకుడు అడుగుపెట్టి, దశాబ్దాల పాటు ‘మెగాస్టార్’గా ఏకచ్ఛత్రాధిపత్యం వహించడం వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. ఆయన రాకతో బాక్సాఫీస్ లెక్కలే కాదు, సినిమా మేకింగ్ స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తోటల్లో చెట్ల చుట్టూ తిరిగే పాటలు, డూప్‌లతో నడిచే ఫైట్ల నుంచి.. హీరో అంటే అన్నీ తానై చేసే ‘వన్ మ్యాన్ షో’ వరకు తెలుగు సినిమాను తీసుకెళ్లిన ఘనత చిరంజీవిది. ఆయన ప్రస్థానం, ఇండస్ట్రీలో ఆయన తీసుకొచ్చిన మార్పులు, సినీ పరిశ్రమలో కుల రాజకీయాల వాస్తవాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు మురళీ మోహన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఇది చదవండి: ఆ టైంలో చిరంజీవి కంటే ఎక్కువ హిట్స్ నాకే ఉన్నాయ్.. కానీ ఆయన ఏం చేశాడంటే.!

చిరంజీవి తొలి చిత్రం “ప్రాణం ఖరీదు” విడుదల కాకముందే ఆయనలోని స్పార్క్‌ను తాను గమనించానని చెప్పారు. “ఆయన కళ్ళలో ఒక విలక్షణమైన పవర్ ఉండేది. కోపాన్ని, హాస్యాన్ని ఆ కళ్ళు అద్భుతంగా పలికించేవి. దానికి తోడు ఆ బాడీ లాంగ్వేజ్, టైమింగ్ చూసి నేను ముగ్ధుడనయ్యాను” అని మురళీ మోహన్ వివరించారు. ఒకసారి తను, చిరంజీవి, మరో ముగ్గురు షూటింగ్ లేనప్పుడు ఓ సినిమా చూసి వస్తుంటే.. దారిలో ప్రజలు తనను చూసి ఎగబడ్డారని మురళీ మోహన్ అన్నారు. అప్పుడు చిరు ఎంతో వినయంగా “అన్నయ్య.. నాకు కూడా ఇలాంటి గుర్తింపు వస్తుందా?” అని అడిగితే, “నీకు దీనికి పది రెట్లు ఎక్కువ క్రేజ్ వస్తుంది” అని తాను చెప్పినట్టుగా గుర్తు చేసుకున్నారు. ఆ మాటలను చిరంజీవి తన స్వయంకృషితో నిజం చేసి చూపించారు.

ఇవి కూడా చదవండి

ఒక సందర్భంలో చిరంజీవి నటన చూసి కృష్ణదాసు అనే ఆయన “ఈ అబ్బాయి మంచి విలన్ అవుతాడు” అన్నారట. కానీ, మురళీ మోహన్ మాత్రం అప్పుడే ఒక జోస్యం చెప్పారు.. “ఈ అబ్బాయి విలన్ కాదండీ.. ఇండస్ట్రీకే ‘మొగుడు'(సుప్రీమ్ హీరో) అవుతాడు చూడండి” అని. ఆయన అన్నట్టుగానే అనతి కాలంలోనే చిరంజీవి టాలీవుడ్ బాక్సాఫీస్ సుల్తాన్‌గా మారిపోయారు. చివరకు అల్లు అరవింద్ లాంటివారు కూడా చిరంజీవి ఈ స్థాయిలో శిఖరాగ్రానికి చేరుకుంటారని అప్పట్లో ఊహించలేదట! “కుక్క కాటుకు చెప్పు దెబ్బ” వంటి సినిమాల్లో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలు చేసి, ఆ తర్వాత పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా ఆయన ఎదిగిన తీరు అద్భుతం. చిరంజీవి రాకముందు తెలుగు సినిమాల్లో డాన్సులు అంటే కేవలం ఒక పద్ధతి ప్రకారం సాగేవి. కానీ చిరు క్లాసిక్ భరతనాట్యాన్ని కాకుండా, సంగీతంలోని బీట్‌కు తగ్గట్టుగా శరీరాన్ని విల్లులా వంచుతూ చేసిన ‘గ్రేస్‌ఫుల్’ స్టెప్పులు యువతను ఊర్రూతలూగించాయి. ఆయన కళ్లతో పలికించే హావభావాలు, కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చాయి. అంతేకాదు, అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజాలు కూడా రిస్కీ ఫైట్ సీన్లలో డూప్‌లను వాడేవారు. కానీ చిరంజీవి మాత్రం “నా ఫైట్లు నేనే చేసుకుంటా” అని పట్టుబట్టారు. రిస్క్ తీసుకొని ఆయన చేసిన ఒళ్లు గగుర్పొడిచే పోరాట ఘట్టాలు, సింగిల్ టేక్ డాన్సులు తెలుగు సినిమా స్టాండర్డ్స్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. జయకృష్ణ, క్రాంతి కుమార్ లాంటివారు ఆయనలోని ఈ నిబద్ధతను చూసి ప్రోత్సహించడంతో మెగా శకం మొదలైంది.

తెలుగు సినీ పరిశ్రమలో కులతత్వంపై తరచూ వినిపించే ఆరోపణలపై ఒక స్పష్టమైన వాదన ఉంది. ఇండస్ట్రీ మద్రాసులో ఉన్నంత కాలం అసలు ‘కులం’ అనే మాటే వినిపించేది కాదు. అక్కడ అందరూ ఒకే గొడుగు కింద ఒకే కుటుంబంలా ఉండేవారు. కానీ పరిశ్రమ హైదరాబాద్‌కు మారిన తర్వాతే రాజకీయ కారణాల వల్ల కుల ప్రస్తావనలు తెరపైకి వచ్చాయనేది నిజం. కొందరు ఒక వర్గం ఆధిపత్యం వల్ల ఇతరులకు అవకాశాలు రావని వాదిస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే.. 75 శాతం మంది నిర్మాతలు, థియేటర్ల యజమానులు ఒకే వర్గానికి చెందిన వారైనా.. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి లాంటి స్టార్లందరూ వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన వారే. సినిమా అనేది ఒక క్రియేటివ్ బిజినెస్. ఇక్కడ కులాలకు ఓట్లు ఉండవు.. కేవలం టాలెంట్‌కు మాత్రమే టికెట్లు తెగుతాయి. మార్కెట్ విలువ, నటనా సామర్థ్యం ఉన్న వారికే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు తప్ప, కేవలం కులం చూసి ఎవరూ కోట్లు ఖర్చు చేయరు.

ఇది చదవండి: 40కిపైగా సినిమాలు.. స్టార్ హీరో అవ్వాల్సినోడు.. చివరికి కమెడియన్‌గా మిగిలిపోయాడు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us