AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 40కిపైగా సినిమాలు.. స్టార్ హీరో అవ్వాల్సినోడు.. చివరికి కమెడియన్‌గా మిగిలిపోయాడు..

సుధాకర్.. ఈ పేరు వినగానే మన ముఖంపై ఒక నవ్వు విరుస్తుంది. కానీ ఈ నవ్వుల వెనుక ఒక స్టార్ హీరో ప్రయాణం ఉంది. తమిళనాట ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన సుధాకర్, రజనీకాంత్ లాంటి వారికే పోటీ ఇచ్చేవారట. మరి అలాంటి నటుడు తెలుగులో కమెడియన్‌గా ఎందుకు స్థిరపడ్డారు? చిరంజీవితో ఆయనకున్న అనుబంధం ఏంటి.?

Tollywood: 40కిపైగా సినిమాలు.. స్టార్ హీరో అవ్వాల్సినోడు.. చివరికి కమెడియన్‌గా మిగిలిపోయాడు..
Tollywood
Ravi Kiran
|

Updated on: May 08, 2026 | 8:27 AM

Share

మనం తెరపై చూసే సుధాకర్ వేరు, ఆయన నిజ జీవిత ప్రయాణం వేరు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక డిప్యూటీ కలెక్టర్ కొడుకుగా పుట్టిన సుధాకర్, చిన్నప్పటి నుండే సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. చెన్నైలో యాక్టింగ్ స్కూల్‌లో చేరినప్పుడు ఆయనకు చిరంజీవి రూమ్ మేట్. వీరిద్దరూ మంచి స్నేహితులు. అయితే చిరంజీవి కంటే ముందే సుధాకర్‌కు హీరోగా బ్రేక్ వచ్చింది, అది కూడా తమిళ ఇండస్ట్రీలో! తమిళంలో ‘కిళక్కే పోగుమ్ రైల్’ అనే సినిమాతో సుధాకర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆ తర్వాత వరుసగా 40 సినిమాలు హీరోగా చేశారంటే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చు. ఒకానొక దశలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. సుధాకర్ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయేవారట. తమిళనాట ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా?

తమిళంలో కొన్ని కారణాల వల్ల అవకాశాలు తగ్గడం, రాజకీయాల ప్రభావం వల్ల ఆయన మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ వైపు చూడాల్సి వచ్చింది. తెలుగులో అప్పటికే చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగిపోయారు. సుధాకర్ ఇక్కడ విలన్‌గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే ఆయనలోని కామెడీ టైమింగ్‌ను గుర్తించిన దర్శకులు ఆయనను కమెడియన్‌గా మార్చేశారు. ముఖ్యంగా ఆయన మాట్లాడే విలక్షణమైన శైలి ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా అందరు స్టార్ హీరోల సినిమాల్లో సుధాకర్ ఒక వెలుగు వెలిగారు. ‘యముడికి మొగుడు’, ‘పెళ్ళి పీటలు’, ‘శుభాకాంక్షలు’ లాంటి సినిమాల్లో ఆయన కామెడీ, పంచ్ టైమింగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్.

నిర్మాతగా మారి ‘యముడికి మొగుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లను కూడా అందించారు. కానీ కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి. కోమాలోకి వెళ్లి మళ్ళీ ప్రాణాలతో తిరిగి రావడం ఆయన జీవితంలో ఒక పెద్ద మిరాకిల్. ఒక స్టార్ హీరోగా ఉండాల్సిన వ్యక్తి కమెడియన్‌గా మిగిలిపోవడం ఆయన అభిమానులకు కొంత బాధ కలిగించినా, సుధాకర్ మాత్రం దేనినీ తక్కువగా చూడలేదు. ఏ పాత్ర ఇచ్చినా తనదైన మార్కుతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా, ఆయన పండించిన కామెడీ మాత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.

Follow Us