మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్న అతను ఆ తర్వాత తండ్రితో కలిసి ఆచార్య సినిమాలో సందడి చేశారు. ఈ సినిమా మిశ్రమ ఫలితం అందుకున్నా చెర్రీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇదే జోష్‌తో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సౌతిండియన్ సూపర్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో నటిస్తున్నాడు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్‌రాజు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో పాటు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి సినిమాకు పచ్చజెండా ఊపాడు చరణ్. అదేవిధంగా కేజీఎఫ్ డైరెక్టర్ నీల్ ప్రశాంత్ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు సైన్ చేశాడు. తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 11వ శతాబ్దానికి చెందిన రాజా సుహేల్ దేవ్ పాత్రలో చెర్రీ కనిపించనున్నట్లు సమాచారం.
కాగా ఇదివరకు మగధీర సినిమాలో కాల భైరవ పాత్రలో నటించి మెప్పించాడు రామ్‌చరణ్. ఇప్పుడు ఏకంగా మహారాజా పాత్రలో కనిపించనున్నారని వినికిడి. ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి రాసిన ‘లెజెండ్ ఆఫ్ సుహేల్ దేవ్: ది కింగ్ హూ సేవ్డ్ ఇండియా’ పుస్తకం ఆధారంగా ఓ సినిమాని గతంలో ప్రకటించారు. రెండేళ్ల క్రితం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారు. అయితే అనుకోకుండా వచ్చిన కరోనా కారణంగా ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మళ్లీ పట్టాలెక్కించడానికి అమిష్ త్రిపాఠి సన్నాహాలు చేస్తున్నారు. కాగా సుహేల్ దేవ్ పాత్ర కోసం గతంలో అక్షయ్ కుమార్ పేరుని పరిశీలించారట. అయితే తాజాగా ఈ క్యారెక్టర్ చరణ్‌ని సంప్రదించారట. చెర్రీ కూడా ఈ హిస్టారికల్ సినిమాలో నటించడానికి సుముఖంగా ఉన్నారని భోగట్టా. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాజా సుహేల్ దేవ్ విషయానికి వస్తే.. ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తికి చెందిన మహా రాజు ఆయన. బహ్రైచ్‌లో గజనీ సైన్యానికి చెందిన మొహమ్మద్‌ను సుహేల్ దేవ్ ఓడించారు. ఈ యుద్ధంతో పాటు 11వ శతాబ్దంలో భారతదేశంపై టర్కీ చేసిన పలు దాడుల నేపథ్యంలో అమిష్ త్రిపాఠి ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మరి సుహేల్ దేవ్ పాత్రను చెర్రీ చేస్తారా? దర్శకత్వం ఎవరు వహిస్తారంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..